

హైదరాబాద్, ప్రభాత ఉదయం: రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు తెచ్చే కుట్ర జరుగుతోందని, అందుకే దాని ఏర్పాటు జీవోను తాము వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రైతన్నకు ఉరి వేసే కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ సహించదన్నారు. రైతు డిస్కం జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతు డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, హైదరాబాద్ జల మండలి, మిషన్ భగీరథ మొత్తంగా 30,62,853 కనెక్షన్లను బదిలీ చేశారని, ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ 2,000 మందితోనే ఎలా సాధ్యమని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేవలం 25 శాతం థర్మల్ పవర్ కేటాయింపుతో రైతుల సాగుకు, ప్రజల తాగు నీళ్లకు అవసరమయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుందని ఆయన నిలదీశారు. రాష్ట్ర సర్కారుకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమైతే, తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు.