

హైదరాబాద్, ప్రభాత ఉదయం: రాష్ట్రంలో కరువు, ఎల్నినో పరిస్థితులు విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ఢిల్లీ నుంచి పిలుపురాగానే ముఖ్యమంత్రి, మంత్రులు సర్కారు పనులన్నింటినీ పక్కనపడేసి ఉరుకులు, పరుగులు పెడుతున్నారని మండిపడ్డారు. తాజాగా ఆదివారం, సోమవారం న్యూఢిల్లీకి పరుగులు పెట్టిన విధానం రాష్ట్ర ప్రజలపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
‘‘రైతులంతా సోమవారం ఉదయం 11 గంటలకు రైతు వేదికలకు రావాలని, సీఎం మాట్లాడతారని ఆదివారం రోజు మెసేజ్లు పంపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ఆదివారం రాత్రి ఎమ్మెల్యేలకు కూడా మెసేజ్లు పంపారు. తీరా సోమవారం ఉదయం 9.52 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ రద్దు అని మెసేజ్లు పంపారు. ఆ తర్వాత మళ్లీ 11 గంటలకు ఉంటుందని మెసేజ్ ఇచ్చారు. తదుపరిగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ రద్దు అని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రాడు కానీ డిప్యూటీ సీఎం వస్తాడని తెలిపారు. ఇలా రాష్ట్ర రైతులతో చిన్నపిల్లల ఆటలాడుతున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ఉంటుందని మొన్న మంత్రి పొంగులేటి చెప్పారు. సీరియస్గా మాట్లాడతామని ఆయన ఆరోజు పేర్కొన్నారు. కట్ చేస్తే, ఆదివారం రోజు ముఖ్యమంత్రి గోవాకు వెళ్లారు. మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి మాటలు తుస్సయ్యాయి” అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కరువు, ఎల్నినో లాంటి తీవ్ర సమస్యలపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. గత తొమ్మిది నెలల్లో రైతు సంక్షేమం కోసం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంటలు వేయొద్దంటూ లీకులు ఇప్పించి వార్తలు రాయిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. ‘‘రైతులు పంటలు వేయకపోతే ఏం చేయాలి? రైతు కూలీల పరిస్థితేంటి ? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎలా బతకాలి? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో బల్లలు చరిచారు తప్ప, క్షేత్రస్థాయిలో ఏం చేశారు?” అని ఆయన నిలదీశారు. ‘‘దళిత, గిరిజన కుటుంబాలంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపా?, కాంట్రాక్టులు, విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది కానీ, పేదలకు భరోసా కల్పించడానికి సమయం లేదా?’’ అని నిలదీశారు.