బాధితులను ఆదుకోకపోవడం విచారకరం : హరీశ్ రావు

పాలమూరుకు చెందిన దళిత కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
బాధితులను ఆదుకోకపోవడం విచారకరం : హరీశ్ రావు
Published on: 

ప్రభాత ఉదయం, జోగులాంబ గద్వాల/అలంపూర్: పాలమూరుకు చెందిన దళిత కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి గద్వాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం బాధిత కుటుంబాలను హరీశ్‌రావు పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన వారికి పూర్తిస్థాయి వైద్యం అందించడంతోపాటు, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకొనే ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు.  

జిల్లాలో ఉపాధి కరువు

గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక, ఉపాధి అవకాశాలు తగ్గడంతో కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి ఆరోపించారు. నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల మోటర్ల నిర్వహణ, సాగునీటి సరఫరాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వ్యవసాయానికి అవసరమైన నీటిని సమర్థవంతంగా అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. విద్యుత్‌ సరఫరా, మోటర్ల నిర్వహణలో లోపాల వల్ల చివరి ఆయకట్టు భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలమూరు ప్రజలు తమ గ్రామాల్లోనే వ్యవసాయం చేసుకుంటూ గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించాలని, వలసలు అరికట్టేందుకు ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

హరీశ్‌రావుకి ఘన స్వాగతం

గద్వాల జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావుకి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఘన స్వాగతం పలికారు. ఎర్రవల్లి చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాతో సన్మానించారు.