పదేళ్లుగా ఏం చేస్తున్నారు?

వైద్య ఉద్యోగుల కేడర్ కేటాయింపు పిటిషన్లపై ప్రతివాదులు అక్టోబర్ 29లోగా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గడువు దాటితే రోజుకు రూ.25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Telangana High Court
Telangana HC refuses to extend interim relief in cadre allocation cases
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వైద్య ఉద్యోగుల కేడర్‌ కేటాయింపు వివాదంలో డాక్టర్‌ శ్రీలక్ష్మి, డాక్టర్‌ రత్నమందాలు దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులను పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. కేడర్‌ కేటాయింపునకు సంబంధించిన ప్రత్యేక అనుమతి పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీలు) సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే పరిష్కరించుకోవాలని శుక్రవారం స్పష్టం చేసింది. తాజా పిటిషన్లలో ప్రతివాదులు ఈ నెల 29లోగా కౌంటర్లు దాఖలు చేయాలని జస్టిస్‌ లక్ష్మణ్‌, జస్టిస్‌ సుజన కళాసికం ధర్మాసనం ఆదేశించింది. గడువులోగా కౌంటర్లు దాఖలు చేయకపోతే రోజుకు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

మధ్యంతర ఉత్తర్వులు పొడిగించలేం

ఉదయం విచారణ సందర్భంగా కేడర్‌ కేటాయింపు వివాదంలో రాష్ట్ర అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగులను మరో రాష్ట్రానికి వెళ్లాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్‌ 24న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించిందని గుర్తుచేసింది. ఆ వినతులపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు ఎప్పుడు తెలియజేసింది? అనే వివరాలను మధ్యాహ్నం 2.15 గంటలకు సమర్పించాలని ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించకపోతే సాయంత్రం 4.15 గంటలకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరును కూడా ఆదేశిస్తామని తెలిపింది. మధ్యాహ్నం న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రధాన వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత రిట్‌ పిటిషన్లలో స్టేటస్‌కో ఇస్తూ మరో ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించేందుకు తాము మొగ్గు చూపడం లేదని స్పష్టం చేసింది.

వివాదం ఇదీ

రాష్ట్ర విభజన నేపథ్యంలో వైద్య విద్యాశాఖ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 25న జారీ చేసిన తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దాఖలు చేసిన పిటిషన్లపై తొలుత డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర స్టే ఇచ్చింది. 2022లో ఆ రిట్‌ పిటిషన్లను కొట్టివేయడంతో పలువురు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే.. గత నెల పిటిషనర్లకు రిలీవ్‌ ఆర్డర్లు జారీ చేశారు. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్‌), హనుమకొండలో ప్రసూతి, స్త్రీరోగ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీలో డిప్యుటేషన్‌పై ఉన్న తనను ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్‌ చేస్తూ గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ రత్నం ఆండాళ్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తనను తుది కేటాయింపు ఉత్తర్వులు వెలువడకముందే రిలీవ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీలక్ష్మి కూడా హైకోర్టును ఆశ్రయించారు.