

భారతీయ ఆధ్యాత్మిక పరంపరలో ‘స్వయంభూ’ క్షేత్రాలకు ఉన్న ప్రాశస్త్యం అనన్యమైనది. దైవం స్వయంగా వెలిసినట్టుగా భావించే ఇలాంటి క్షేత్రాలను భక్తులు అపారమైన దైవశక్తికి నిలయాలుగా విశ్వసిస్తారు. సాధారణ ఆలయాల్లో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేసి దైవస్వరూపాన్ని కొలుస్తారు. కానీ స్వయంభూ క్షేత్రాల్లో మాత్రం దైవసాన్నిధ్యం ముందునుంచే ఉందని, అక్కడి శక్తి సహజసిద్ధమైనదని భక్తుల నమ్మకం. ఇక ఆ స్వయంభూ దైవం విఘ్నాలను తొలగించే వినాయకుడైతే.. ఆ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరింత పెరుగుతుంది. కార్యసిద్ధి, జ్ఞానం, బుద్ధి, శుభారంభాలకు అధిదేవుడిగా పూజలందుకునే గణపతి స్వయంగా వెలిసిన క్షేత్రాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే స్వయంభూ వినాయకుడి దర్శనం అంటే కేవలం ఆలయ సందర్శన కాదు.. జీవితంలోని విఘ్నాలు తొలగి, తలపెట్టిన కార్యాలు సఫలమవుతాయనే విశ్వాసంతో చేసే దైవదర్శనం. మరి తెలంగాణలోని ఆ స్వయంభూ వినాయక క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి వివరాలు తెలుసుకుందాం...
రేజింతల్ స్వయంభూ గణపతి.. ఏటా నువ్వు గింజంత పెరుగుతాడట!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని రేజింతల్ క్షేత్రం స్వయంభూ గణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన గణనాథుడు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత గణపతి విగ్రహం మొత్తం సింధూరంతో కప్పబడి ఉండటమే. గణేశ పురాణంలోని విశ్వాసాల ప్రకారం సింధూర గణపతిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంగా వెలిశారని స్థానికుల విశ్వాసం. అంతేకాదు.. ఈ విగ్రహం కాలక్రమంలో ఏటా నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతుందని ఇక్కడి భక్తులు చెబుతారు. ఈ విశేషమే రేజింతల్ గణపతి ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ముడుపు కడితే వివాహం జరుగుతుందని, సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల్లో బలమైన నమ్మకం ఉంది. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి రేజింతల్కు చేరుకునేందుకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఆవంచలో 30 అడుగుల ఏకశిలా గణపతి.. దేశంలోనే అరుదైన విగ్రహం!
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ గ్రామం మరో విశిష్ట స్వయంభూ గణపతి క్షేత్రానికి నిలయంగా ఉంది. ఇక్కడ గణనాథుడు ఏకశిలా విగ్రహంగా, ఐశ్వర్య గణపతి పేరుతో పూజలందుకుంటున్నాడు. దాదాపు 30 అడుగుల ఎత్తులో గంభీరంగా దర్శనమిచ్చే ఈ భారీ వినాయక విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహాల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ విగ్రహానికి సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉందని క్షేత్ర స్థలపురాణం చెబుతోంది. పశ్చిమ చాళుక్యుల కాలానికి చెందిన రాజు ఈ గణపతిని ప్రతిష్ఠించినట్లు స్థానిక కథనాలు పేర్కొంటాయి. పచ్చని పంట పొలాల మధ్య కొలువైన లంబోదరుడి భారీ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆవంచ గణపతిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. జడ్చర్ల నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.
శ్వేతార్క వృక్షం వేరులో వెలసిన గణపతి.. అరుదైన స్వయంభూ క్షేత్రం!
వరంగల్ నగరంలోని కాజీపేటలో శ్వేతార్కమూల గణపతిగా పూజలందుకుంటున్న వినాయకుడు స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధి చెందాడు. ‘శ్వేతార్కం’ అంటే తెల్ల జిల్లేడు చెట్టు. భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసాల్లో ఈ వృక్షాన్ని గణపతికి ప్రతిరూపంగా భావిస్తారు. శతాబ్దానికి పైగా వయసున్న శ్వేతార్క వృక్షం వేరులో సహజసిద్ధంగా గణపతి ఆకృతి ఏర్పడుతుందని పురాణ విశ్వాసాలు చెబుతాయి.
కాజీపేటలోని గణనాథుడు కూడా అలాంటి శ్వేతార్క వృక్షం వేరులోనే వెలిశాడని భక్తుల నమ్మకం. తూర్పు ముఖంగా కొలువైన ఈ గణపతిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, విఘ్నాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ గణనాథుడి సన్నిధికి సాధారణ రోజుల్లోనే కాకుండా ముఖ్యంగా బుధవారాలు, పర్వదినాలు, వినాయక నవరాత్రుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అలా ఓ చెట్టు వేరు దైవస్వరూపంగా మారిన అరుదైన క్షేత్రంగా కాజీపేట శ్వేతార్కమూల గణపతి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
సికింద్రాబాద్ సిద్ధివినాయకుడు.. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం!
జంట నగరాల్లో సుపరిచితమైన గణపతి క్షేత్రాల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని సిద్ధివినాయక ఆలయం ఒకటి. లష్కర్ గణపతిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారిని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. సుమారు రెండు శతాబ్దాల క్రితం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలోని ఓ బావిలో గణపతి విగ్రహం లభించిందని ఆలయ స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుంచి స్వామివారి పట్ల భక్తుల విశ్వాసం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ఇక్కడ గణనాథుడు సిద్ధి వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శివుడు, అమ్మవారు, వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయుడు, శనీశ్వరుడు, రాహు-కేతువులకు ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. స్వామివారిని భక్తిశ్రద్ధలతో వేడుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వినాయక నవరాత్రులను ఇక్కడ ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రతి నెలా జరిగే సంకటహర చతుర్థి వేడుకలకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన గణపతి క్షేత్రాలను దర్శించే భక్తులకు సికింద్రాబాద్ లష్కర్ సిద్ధివినాయక ఆలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ఆయన అనుగ్రహం పొందేందుకు భక్తులు నిత్యం ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.