

ప్రభాత ఉదయం, నారాయణఖేడ్: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతుంటే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని హుక్రానా(జి) గ్రామం మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంటోంది. చిన్నా పెద్దా కలిసి ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మను ఆ గ్రామంలో సుమారు 80 ఏళ్లుగా ఆడటం లేదు. గ్రామపెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో గ్రామంలోని ఓ పెద్ద కుటుంబంలో బతుకమ్మ పండుగ రోజున పలువురు మరణించారట. దీంతో పండుగ జరుపుకుంటే అశుభం జరుగుతుందనే నమ్మకం గ్రామస్థుల్లో ఏర్పడింది. అప్పటి నుంచి బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం కొందరు గ్రామస్థులు పండుగ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. ఆ తర్వాత వరుస మరణాలు సంభవించాయని, దీంతో బతుకమ్మ ఆడే ఆలోచనను విరమించుకున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.