

ప్రభాత ఉదయం, కంటోన్మెంట్ : వైద్య ప్రక్రియల ముసుగులో మహిళల అండాలతో అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. ఒక్కో అండాల సేకరణ ప్రక్రియకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తామంటూ పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు రప్పిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై శనివారం బేగంపేట, సరూర్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 43 మంది మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను గుర్తించి, డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ప్రకాష్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లోని అద్దె ప్రాంగణాల్లో వారికి వసతి కల్పిస్తున్నారు. అనంతరం ఐవీఎఫ్, ఫెర్టిలిటీ కేంద్రాల్లో అండాల సేకరణ ప్రక్రియలకు పంపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అండాల సేకరణకు ముందు కొందరు మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇచ్చినట్లు బాధితులు పోలీసులకు వెల్లడించారు. తనిఖీల్లో ఐదు హ్యూమోగ్ హెచ్‌పీ 150 ఐ.యూ. ఇంజెక్షన్ సీసాలు, సిరంజిలు, సూదులు, ప్రిమోలట్, మెప్రేట్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణ, అవసరమైన అనుమతులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో నిబంధనలు పాటించారా? లేదా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారం వెనుక నిర్వాహకులు, రిక్రూటర్లు, ఏజెంట్లు, మధ్యవర్తులతో కూడిన నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో మహిళలను గుర్తించడం, హైదరాబాద్‌కు తరలించడం, వసతి కల్పించడం, ఫెర్టిలిటీ కేంద్రాలకు పంపించడం వంటి పనులను వేర్వేరు వ్యక్తులకు అప్పగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, కమీషన్లపైనా ఆరా తీస్తున్నారు.
ఈ దాడులకు సంబంధించి బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఒకటి, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. అమిత్ శర్మ, నిక్కత్ పర్వీన్, రేష్మా ఖాతూన్, మేఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను, జెప్రే ప్రదీప్, ఎస్.కె. పర్వీన్, విజయ్ భగ్వా రావు సాలుంకే, పంకజ్ సోనీ తదితరులపై ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సరూర్‌నగర్ కేసులో ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్ పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.
మహిళల నియామకానికి నకిలీ ఆధార్ కార్డులు, అఫిడవిట్లు ఉపయోగించారా? అండాల సేకరణకు సంబంధించిన అంగీకార పత్రాలు, వైద్య రికార్డులు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం-2021 నిబంధనల ప్రకారం ఫెర్టిలిటీ కేంద్రాలు, ఏఆర్‌టీ బ్యాంకుల పాత్రపైనా విచారణ చేస్తున్నారు. మహిళలను బలవంతంగా లేదా మోసపూరితంగా ఈ ప్రక్రియల్లోకి తీసుకొచ్చారా? మానవ అక్రమ రవాణా కోణం ఏమైనా ఉందా? అనే అంశాలపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్ల డీసీపీలు, ఎస్‌ఓటీ అధికారులు, బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులతో కూడిన బృందాలు సమన్వయంతో దాడులు నిర్వహించాయి. రక్షించిన 43 మంది మహిళల వివరాలు, వైద్య చరిత్ర, వారు ఎదుర్కొన్న పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు.