పని ఒత్తిడితో ప్రాణం తీసుకుంటున్నరు ..రెండు వారాల్లోనే ఆరుగురు టెకీల సూసైడ్​

పని ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై ఆందోళన, కంపెనీల లక్ష్యాలు, వ్యక్తిగత సమస్యలు.. ఇలా పలు కారణాలతో హైదరాబాద్‌లో రెండు వారాల వ్యవధిలో ఆరుగురు ఐటీ ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
Mental health awareness and workplace stress for IT Proffesionals
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ సిటీ : ఉన్నత చదువులు.. ఆశయాలు.. కెరీర్​ ప్రారంభంలోనే ఐదంకెల జీతం, భవిష్యత్​లో ఉన్నత స్థాయికి చేరుకొనే అవకాశం.. ఇన్నీ ఉన్నా కొందరు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు​ అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పని ఒత్తిడి, ఉద్యోగంలో అభద్రతాభావం, కంపెనీల టార్గెట్స్, ఇతర అంశాలతో టెకీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ టెన్షన్లు తట్టుకోలేని కొందరు ఆత్మహత్యల బాటపడుతున్నారు. రెండు వారాల వ్యవధిలో ఆరుగురు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు బలవన్మరణాలకు పాల్పడటం ఐటీ ఇండస్ట్రీలో కలవరపెడుతోంది.

పని ఒత్తిడి.. టార్గెట్స్

ఐటీ ఉద్యోగమంటేనే లక్ష్యాల వెంట పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. నిర్ణీత గడువులో ప్రాజెక్టులు పూర్తి చేయడం, క్లయింట్లతో సమావేశాలు, పగలు రాత్రీ తేడాలేని పని వేళలు, నిరంతరం టెక్నాలజీని నేర్చుకోవడం, టెకీలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీనికితోడు సంస్థల్లో నిరంతరం పనితీరును సమీక్షించడం, ప్రాజెక్టుల నుంచి తొలగిస్తారేమోనన్న భయం, ఉద్యోగ కోతలపై వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధిక వేతనాలు పొందుతున్న టెకీలు సైతం పెరిగిన ఖర్చులు, ఇంటి అద్దెలు, ఈఎంఐలు, , కుటుంబ బాధ్యతలతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు, అప్పులు నియంత్రణ లేక మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. మరికొందరు ఆర్థిక సమస్యలు, ఉద్యోగ భద్రతపై ఆందోళన,  ప్రేమ వైఫల్యాలు, లివింగ్​ రిలేషన్స్​, ఒంటరితనం.. ఇలా వ్యక్తిగత విషయాలతో మానసికంగా కుంగిపోతున్నారు. ఈ మానసిక సంఘర్షణలతో కొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ల ఆత్మహత్యలపై ఫ్యామిలీ కౌన్సిలర్​ డాక్టర్​ శ్రీకాంత్​ మాట్లాడుతూ ‘మానసిక సంఘర్షన ఒక్కరోజులో ఏర్పడేది కాదు. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆర్థిక సమస్యలు, రిలేషన్స్​లో విభేదాలు, ఒంటరితనం వంటి అంశాలు ఒకదానికొకటి తోడై మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బయటకు సంతోషంగా కనిపించే వ్యక్తి కూడా లోపల తీవ్ర ఆందోళనతో ఉండవచ్చు’ అని అన్నారు. రోజువారీ లక్ష్యాలు, ప్రాజెక్టు డెడ్​లైన్స్​, లే ఆఫ్స్​, పని వేళల్లో మార్పులు టెకీల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విదేశీ క్లయింట్లతో రాత్రి వేళల్లో సమావేశాలు  కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా తగ్గిస్తున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యలు కుటుంబంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఇవి కూడా సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి’ అని డీబీఎన్​ బ్యాంక్ సాఫ్ట్ వేర్ సపోర్ట్ మేనేజర్ సంతోష్​ తెలిపారు.

కుటుంబం.. సంస్థల బాధ్యత కూడా!

ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత సమస్యలుగా చూడకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తమ పిల్లలు, జీవిత భాగస్వామి, స్నేహితుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను గమనించాలి. వారితో సమయం గడపాలి. సంస్థలు ఉద్యోగులపై పనిభారాన్ని సమీక్షించడంతోపాటు మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. మానసిక సమస్యలు లేదా ఆత్మహత్య ఆలోచనలు వస్తే ఎదురైతే కేంద్ర ప్రభుత్వ టెలీ-మానస్ సేవ 14416 నంబర్‌ను సంప్రదించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

 రెండు వారాల్లో ఆరుగురి బలవన్మరణం...

  • భరత్ (29) ​గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. అక్టోబర్ 12న నానక్‌రామ్‌గూడలోని ‘గోల్ఫ్ ఎడ్జ్’ అపార్ట్‌మెంట్స్ 30వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విపరీతమైన పని ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై ఆందోళనలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణతో తేలింది.

  •   కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హీలియం గ్యాస్ పీల్చుకుని హర్యానాకు చెందిన సౌరభ్​ శేఖర్(36) బలవన్మరణానికి పాల్పడ్డాడు. పదేళ్లుగా ఐటీలో పనిచేస్తున్న సౌరభ్​.. పని ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యాడు. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి భరించలేక, మనస్తాపానికి గురైన అతను ‘అమ్మానాన్న క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసి అక్టోబర్​ 12న ఆత్మహత్య చేసుకున్నాడు.

  • అక్టోబర్ 19, 2026 న తమ్మిశెట్టి ప్రవీణ్(34) చైతన్యపురిలోని తన అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి దూకి చనిపోయాడు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి దాదాపు రూ.35 లక్షల వరకు నష్టపోయాడు. సమాజంలో, కుటుంబంలో పరువు పోతుందనే మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి మూడు నెలల క్రితమే పెళ్లి అయింది.

  • రోహితరెడ్డి(26) విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక సార్లు వీసా రిజెక్ట్ అయింది. ఈసారి కూడా రిజెక్ట్​ అవుతుందన్న భయంతో ఈనెల 23న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్(29) అక్టోబర్ 25న మాదాపూర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుంది. ఈమె హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తోంది. ఒకే ఆఫీసులో పనిచేసే తన సహోద్యోగితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి విషయంలో ఇద్దరి విభేదాలు రావడంతో కొలీగ్​కు వీడియో కాల్ చేసి లైవ్‌లోనే ప్రాణాలు తీసుకుంది.

  • అక్టోబర్ 26న రాజేశ్​(25) మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకాడు. విశాఖపట్నానికి చెందిన ఈ యువకుడు హైదరాబాద్ నాచారంలోని హాస్టల్‌లో ఉంటూ మాదాపూర్‌లోని ఐటీ సంస్థలో పనిచేసేవాడు. తీవ్రమైన పని ఒత్తిడి, కెరీర్ పరమైన అభద్రతాభావం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.