

ప్రభాత ఉదయం, హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఆర్థిక వనరుల సమీకరణ ప్రధాన సవాలుగా మారింది. ఎల్అండ్టీ నిర్వహణలో ఉన్న మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే రూ.13,600 కోట్ల వరకూ నిధులు అవసరం. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు రుణాల కోసం ఆపసోపాలు పడుతున్నట్లు సమాచారం. తక్కువ వడ్డీకి రుణాలు అందితే వేగంగా ప్రభుత్వం చేతికి వస్తుందని భావిస్తున్నా, అందుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఓ బ్యాంకు అనుబంధ సంస్థను సంప్రదించి రుణ సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
రెండో దశకు తొలి దశ ముడి
హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభానికి తొలి దశ ప్రాజెక్టు స్వాధీనం అంశం కీలకంగా మారింది. రెండో దశలో ఏడు కారిడార్ల ద్వారా 122.9 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందుకు తొలి దశ టేకోవర్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్వాధీనానికి అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టిసారించారు.
ఎస్బీఐ క్యాపిటల్ పైనే రుణ సమీకరణ భారం
హెచ్ఎంఆర్ఎల్ అవసరమైన రుణం మొత్తాన్ని ఒకే ఆర్థిక సంస్థ నుంచి కాకుండా వివిధ మార్గాల్లో సమీకరించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ క్యాపిటల్స్‌కు అప్పగించడంతో ఆ సంస్థ సహకారంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల తలుపులు తడుతున్నారు. సుమారు రూ.13,600 కోట్ల రుణాన్ని మూడు శాతం వడ్డీతో పొందాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. ఈ మేరకు రుణాలు అందించగల సంస్థలను గుర్తించడం, వాటితో చర్చలు జరపడం, రుణ నిబంధనలను పరిశీలించడం లాంటి అంశాలపై కసరత్తు జరుగుతోంది.
దెబ్బకొట్టిన ఐఆర్ఎఫ్సీ, తెరవెనుక కేంద్ర మంత్రి?
మొదటి దశ మెట్రో కోసం ఇప్పటికే 7 నుంచి 8 శాతం వడ్డీకి రుణాలు పొందిన ఎల్అండ్టీ నష్టాలను చవిచూడగా, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండటానికి హెచ్ఎంఆర్ఎల్ ప్రయత్నిస్తోంది. అయితే, రుణాల సమీకరణలో భాగంగా పలు ఆర్థిక సంస్థలను సంప్రదించగా, మొదట ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. రుణాలు చేతిలోకి వచ్చే అవకాశాలు దాదాపు ఖరారు కాగా, చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. దీంతో ఐఆర్ఎఫ్సీ మీద పెట్టకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ సంస్థ కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో ఉండటంతో రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రి తెర వెనుక అడ్డుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు
3 నుంచి 4 శాతంపై రుణాలు ఇవ్వడానికి ఎవరైతే ముందుకు వస్తారో వారి నుంచే తీసుకోవడానికి హెచ్ఎంఆర్ఎల్ ప్రయతిస్తోంది. ఇటీవల ఆ సంస్థ ఉన్నతాధికారి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారులను సంప్రదించినట్లు సమాచారం. తక్కువ వడ్డీకి నిధులు అందిస్తే నిర్ణీత కాలవ్యవధిలో తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అందుకు ఎస్బీఐ కాపిటల్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ ప్రక్రియ ఈ నెలలోనే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని హెచ్ఎంఆర్ఎల్కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జూన్, జూలైలో ప్రక్రియ మొదలు కాగా, ఆగస్టు, సెప్టెంబర్‌లోనే రుణాల సమీకరణ పూర్తవుతుందని భావించినా, ఆశించిన ఫలితం రాలేదు. డిసెంబర్ 31 వరకే గడువు ఉండటంతో తక్కువ వడ్డీతో రుణాలు పొందడానికి అధికారులు చర్యలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్‌లోగా ఎట్టి పరిస్థితిలోనూ స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.