

ప్రభాత ఉదయం, వేములవాడ: ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన కరెంటు కంచెలు రైతుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కళ్లుకాయలు కాసేలా రాత్రింబవళ్లు పైరును రక్షించుకునే క్రమంలో రైతుల ఊపిరి ఆగిపోతుండటంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తుండటంతో ప్రాణాలకే ముప్పుగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత వారం రోజుల్లోనే కరెంటు తీగలు తగిలి ముగ్గురు మృత్యువాత పడ్డారు. వేములవాడ అర్బన్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన సుంకపాక రాజయ్య, గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య, లక్ష్మి దంపతులు పంట పొలంలోనే తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా చిన్నకారు రైతులే కావడంతో బాధిత కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.
నిబంధనలు గాలికి..
వరి, మొక్కజొన్న తదితర పంటలను అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు పొలాల చుట్టూ కరెంటు కంచె ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఏర్పాటు చేసుకోవడం చట్టరీత్యా నేరం. సౌర విద్యుత్ కంచెలు (సోలార్ ఫెన్సింగ్) కాకుండా... నేరుగా 230/440 వోల్టుల విద్యుత్ సరఫరా చేయడం ప్రాణాంతకంగా మారింది. కరెంట్ కంచె షాక్‌తో ఎవరైనా మృతి చెందితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యుత్, పోలీసు, అటవీ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా పొలాల్లో తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అవగాహన అవసరం
క్ష్తేత్రస్థాయిలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. అడవి జంతువుల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు ప్రభుత్వం రాయితీతో సోలార్ ఫెన్సింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అందుబాటులోకి తేవాలి. పంట పొలాలకు సౌర విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.