ప్రభాత ఉదయం, బోథ్ : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబానికి ఎదురుచూపులు తప్పడం లేదు. రెండు సార్లు లిస్టులో పేరు వచ్చిందని చెప్పారు. చివరకు మంజూరు కాలేదని తెలిసింది. దీంతో కుటుంబ పెద్ద తనకు న్యాయం చేయాలంటూ గ్రామంలోని మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. అది చూసిన ఆయన నాలుగేళ్ల కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
ఎమ్మెల్యే వస్తేనే..
ఇచ్చోడ మండలం జున్ని గ్రామానికి చెందిన మోతివార్ రవీందర్ సొంత గూడు లేదు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో రెండు పర్యాయాలు పేరుందని చెప్పినా చివరకు పేరు తొలగించారని ఆరోపించాడు. అర్హత ఉన్నప్పటికీ తనకు ఇల్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ ట్యాంక్‌పైనే బైఠాయించాడు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామానికి వచ్చి హామీ ఇస్తేనే దిగుతానంటూ భీష్మించుకున్నాడు. లేదంటే ప్రాణాలు తీసుకుంటానంటూ హెచ్చరించాడు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆరోపణలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.