

ప్రభాత ఉదయం, హనుమకొండ : మట్టి తవ్వకాలు, తరలింపునకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకురానుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఆన్ లైన్ పోర్టల్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం మైనింగ్, రెవెన్యూ, టెక్నికల్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టల్ రూపకల్పన, విధివిధానాలు, అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల నిర్మాణం, రైతులు, ప్రజల అవసరాలకు గ్రావెల్ అవసరమైతే తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సులభంగా అనుమతులు పొందేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు రోజుల నుంచి వారం రోజుల్లోపు అనుమతులు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోర్టల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు సీజీజీ టెక్నికల్ టీమ్ శనివారం జిల్లాకు రానుందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు గ్రావెల్ తరలించే వాహనాల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు, గ్రామంలోకి వాహనాలు వచ్చే, పోయే సమయాలను నమోదు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా గ్రావెల్ తవ్వకాలు, తరలింపునకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో మైనింగ్ శాఖ ఏడీ రామాచారి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, ఈడీఎం శ్రీధర్ పాల్గొన్నారు.