కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు: జగదీశ్‌రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి, జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సీఎం, మంత్రులు అవినీతి, కమీషన్లకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు.
సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, సూర్యాపేట : కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సీఎం, మంత్రులు అవినీతి, కమీషన్లకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో కనీసం 18 టీఎంసీలను కూడా ఇప్పటివరకు వినియోగించుకోలేకపోయారని మండిపడ్డారు. గోదావరి నుంచి సుమారు 250 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని గుర్తుచేశారు.

సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను వినియోగంలోకి తేవాలి

సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను తక్షణమే వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో నిరంతర విద్యుత్‌ సరఫరాతో రాష్ట్రం రికార్డు సృష్టించిందని, ప్రస్తుతం సాగునీరు, విద్యుత్‌ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ బొగ్గు సంస్థల నుంచి కమీషన్లు పొందేందుకే సింగరేణి సంస్థను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు విద్యుత్‌, సాగునీరు అందించడం చేతకాకపోతే ఆ బాధ్యతలను తమకు అప్పగించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.