

ప్రభాత ఉదయం, జగిత్యాల : గత రెండు నెలలుగా జగిత్యాల జిల్లా శిశు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్‌కు పిల్లలు లేకపోవడంతో ఓ బాలుడిని దత్తత తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫిర్యాదు మేరకు జిల్లా సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించగా.. తనను అక్కడి నుంచి తీసుకెళ్లాలని బాలుడు తన తల్లిని వేడుకుంటున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘అమ్మా.. భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లు!’ అంటూ కన్నీటితో వేడుకుంటున్న దృశ్యాలు పలువురిని కలచివేస్తున్నాయి. మరోవైపు బాలుడిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. అమల్లో జాప్యం జరుగుతున్నదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుచేసి తమ కొడుకును అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆశ్రయించారు.