

ప్రభాత ఉదయం, జగిత్యాల: ‘అమ్మా.. భయమేస్తోంది.. నన్ను తీసుకుపోమ్మా’ అని రోదించిన బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కడుపున పుట్టకపోయినా.. కన్నబిడ్డలా సాదుకున్న కొడుకు.. మళ్లీ ఒడిలోకి చేరడంతో ఆ తల్లి పులకించి పోయింది. మంత్రి సీతక్క, కలెక్టర్ సత్యప్రసాద్ చొరవ చేయడంతో సోమవారం రాత్రి ఆ బాలుడిని తల్లిదండులకు అప్పగించడంతో రెండు నెలల నిరీక్షణకు తెరపడింది. జగిత్యాలకు చెందిన కాసారపు శ్రీనివాస్ సరిత దంపతులకు పిల్లలు లేకపోవడంతో గతంలో ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఈ విషయం సీడబ్ల్యూసీ అధికారులకు తెలియడంతో మూడేళ్ల రుద్ర మహాన్వేష్ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లడంతో చిన్నారిని వారికే అప్పగించాలని అక్టోబర్ 16న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆర్డర్ కాపీని 28వ తేదీన అధికారులకు అందజేసినప్పటికీ... బాలుడిని అప్పగించలేదు. దీంతో 29వ తేదీన శ్రీనివాస్ సరిత దంపతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తానంటూ చిన్నారి రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు తమ బిడ్డను అప్పగించాలని తల్లిదండ్రులు కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, హైకోర్టు ఉత్తర్వుల మేరకు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించారు. కలెక్టర్ సత్యప్రసాద్ సైతం చొరవ తీసుకోవడంతో శిశు సంరక్షణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో చిన్నారిని గుండెలకు హత్తుకొని ఆనందం వ్యక్తం చేశారు.