జమ్మికుంట.. తెల్లబంగారం కోట

Jammikunta Cotton Market
Jammikunta Cotton Market
Published on: 
  • పత్తి క్రయవిక్రయాల్లో జమ్మికుంట మార్కెట్ అగ్రస్థానం

  • గత పంట సీజన్​లో రూ.196 కోట్ల వ్యాపారం

  • 2.63 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు

ప్రభాత ఉదయం, హుజూరాబాద్:  ఉత్తర తెలంగాణలో రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్​ యార్డు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఉంది. ఇది పత్తి కొనుగోళ్లకు ప్రసిద్ధి. ఈ మార్కెట్​ గత పంట సీజన్​లో మొత్తం 2,63,687 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లతో రూ.196.93 కోట్ల వ్యాపారం చేసింది. తద్వారా పత్తి క్రయవిక్రయాల్లో అగ్రగామిగా నిలిచింది. 2025 అక్టోబరు నుంచి ఈఏడాది (2026) సెప్టెంబరు దాకా జమ్మికుంటకు వచ్చిన పత్తిలో 1,18,630 క్వింటాళ్లను మిల్లర్లు కొన్నారు. దీని విలువ రూ.81.67 కోట్లు. ఇక భారత పత్తి సంస్థ (సీసీఐ)కు 10,666 మంది రైతులు 1,45,057 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. దీని విలువ రూ.115.26 కోట్లకుపైనే ఉంటుంది. ఈవిధంగా గత సీజన్​లో జమ్మికుంట మార్కెట్​ పరిధిలో ​ మొత్తం 2.63 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. 

పత్తి సీజన్​ ఇలా సాగుతోంది

జమ్మికుంట మార్కెట్​లో ఏటా అక్టోబరులో పత్తి క్రయవిక్రయాల సీజన్ మొదలవుతుంది. అయితే  నవంబరు నుంచి మార్కెట్​కు పత్తి రాక ఊపందుకుంటుంది. ప్రధానంగా డిసెంబరు నుంచి మార్చి వరకు యార్డులో సందడి ఉంటుంది. ప్రతిరోజూ సగటున 10 వేల క్వింటాళ్ల నుంచి 15 వేల క్వింటాళ్ల తెల్ల బంగారం వస్తుంటుంది. ఆ తర్వాత క్రమంగా పత్తి రాక తగ్గుముఖం పడుతూ, సెప్టెంబరు నాటికి సీజన్ ముగుస్తుంది.

తొలుత మిల్లర్లు, తర్వాత సీసీఐ

సీజన్ ఆరంభంలో పత్తి ఖరీదుకు వ్యాపారులే దిక్కవుతున్నారు. నాణ్యతను బట్టి ధరలను చెల్లించి వారు కొంటున్నారు. ఈ క్రమంలో పత్తిలో తేమ ఎక్కువైనా, పింజ పొడవు తగ్గినా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఏటా ఈ పరిస్థితుల్లో సీసీఐ రంగంలోకి దిగుతోంది. నాణ్యతా ప్రమాణాలకు లోబడి పత్తిని కొంటోంది. క్వింటాలుకు గరిష్ఠంగా రూ.8667 దాకా, కనిష్ఠంగా రూ.8267 దాకా ధరను రైతులకు చెల్లిస్తోంది. సీజన్ మొత్తం అందుబాటులో ఉంటున్న సీసీఐ మద్దతు ధరల కల్పనలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక సీసీఐ తిరస్కరించిన పత్తిని వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారు.

‘క్యాండీ’ లెక్కన ధర నిర్ణయం

ఒక క్యాండీ పత్తి అంటే సుమారు 355.62 కిలోగ్రాములు. దీన్ని సాధారణంగా లెక్కల కోసం 356 కేజీలుగా పరిగణిస్తారు. సాధారణంగా ఒక పత్తి బేల్ బరువు 170 కిలోలు ఉంటుంది. ఈ లెక్కన ఒక క్యాండీ అనేది దాదాపు 2.09 బేళ్లకు సమానం. హోల్‌సేల్ మార్కెట్‌లో పత్తి ధరలను నిర్ణయించేందుకు ఈ క్యాండీ లెక్కనే ప్రామాణికంగా పరిగణిస్తారు. జాతీయ మార్కెట్​లో దూది, దారం, పత్తి గింజలకు ఉండే డిమాండును బట్టి  జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​లో పత్తి ధరలను  నిర్ణయిస్తారు. ప్రస్తుతం జాతీయ విపణిలో క్యాండీ (356 కిలోల దూది) ధర రూ.62 వేల నుంచి రూ.64 వేల వరకుంది. పత్తి గింజలు క్వింటాలుకు  రూ.4100 దాకా ధర పలుకుతున్నాయి.  ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్​లో నాణ్యమైన పత్తికి క్వింటాలుకు రూ.8 వేలకు మించకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. సరుకులో నాణ్యత లోపిస్తే మాత్రం ధరలు మరింత తగ్గొచ్చని అంటున్నారు. రైతులు పత్తిని ఆరబెట్టి మార్కెట్​కు తీసుకొస్తే మేలని సూచిస్తున్నారు.