

ప్రభాత ఉదయం, వర్ధన్నపేట: ఎల్ నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో తలెత్తబోయే నీటి సమస్యకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష నాయకులు, మేధావులతో సమావేశం ఏర్పాటుచేసి సలహాలు తీసుకోవాలని కోరారు. సోమవారం హనుమకొండలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ, జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశాలో జేపీ మాట్లాడారు. గోదావరి, ప్రాణహిత నదుల్లో అందుబాటులో ఉన్న జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నింపాలని కోరారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పనులను మౌలిక సదుపాయాల కల్పనకే ఉపయోగించుకోవాలని సూచించారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నా ప్రజల అవసరాలు ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో లోక్‌సత్తా నాయకులు సుంకరి ప్రశాంత్, పర్చా కోదండ రామారావు, బండారు రామ్మోహనరావు, సుంకరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.