త్రివేణి సంగమ తీరాన దివ్యధామం.. ‘కాళేశ్వరం’

త్రివేణి సంగమ తీరాన దివ్యధామం.. ‘కాళేశ్వరం’
Published on: 

త్రిలింగ దేశపు మూలస్తంభాలలో ఒకటిగా, గోదావరి–ప్రాణహితల సంగమ తీరాన వెలసిన తెలంగాణలోని అత్యంత ప్రాచీనమైన, మహిమాన్వితమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం ప్రముఖమైనది. పురాణ విశ్వాసాలు, ప్రాచీన శైవ సంప్రదాయాలు, అరుదైన ఆలయ నిర్మాణ విశేషాలతో అలరారే ఈ దివ్యధామం.. భక్తులకు ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రంగా శతాబ్దాలుగా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరంలో గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం అనే మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాల నడుమ విస్తరించిన పవిత్ర భూభాగమే ‘త్రిలింగ దేశం’. ఈ త్రిలింగ క్షేత్రాల్లోనే అత్యంత ప్రాచీనమైందిగా భావించే కాళేశ్వరానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. పూర్వకాలంలో కాళుడు (యమధర్మరాజు) ఇక్కడ పరమశివుని సాక్షాత్కారం కోసం తీవ్రమైన తపస్సు ఆచరించాడని స్థల పురాణం చెబుతోంది. స్కాందపురాణంలోనూ సూత మహర్షి శౌనకాది మునులకు ఈ దివ్యక్షేత్ర మహిమను వివరించినట్లు ఉల్లేఖనలు ఉన్నాయి.

దక్షిణ కాశీ

మహిమాన్విత కాళేశ్వర క్షేత్రాన్ని “దక్షిణ కాశీ” అని కూడా పిలుస్తారు. ఇందుకు చాలా ఆధ్యాత్మిక కారణాలున్నాయి. కాశీలోని ప్రసిద్ధ విశాలాక్షి సమేత విశ్వనాథుని ఆలయ గర్భాలయానికి నాలుగు దిక్కులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. కాశీ, నేపాల్‌లోని పశుపతినాథ ఆలయం తర్వాత నాలుగు దిక్కులా ద్వారాలు ఉన్న ఏకైక శైవక్షేత్రం కాళేశ్వరమే. కాశీలో గంగా నది తీరాన పితృదేవతలకు పిండప్రదానం (తర్పణాలు) చేస్తే ఎంతటి ముక్తి లభిస్తుందో, కాళేశ్వరంలోని గోదావరి–ప్రాణహిత సంగమ తీరంలో (ఇక్కడ సరస్వతి అంతర్వాహినిగా కలుస్తుందని విశ్వాసం) తర్పణాలు వదిలినా అంతే పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. కాశీ శక్త్యాలయమైన అన్నపూర్ణాదేవియే గౌతమ మహర్షి ప్రార్థన మేరకు ఇక్కడ 'శుభానందాదేవి' రూపంలో స్వయంభువుగా వెలిసిందని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ గోదావరి స్నానం చేసి ముక్తీశ్వరుడిని దర్శించుకోవడం వల్ల జీవులకు కాశీలో లభించినట్లే నేరుగా మోక్షం లభించి యమలోకానికి వచ్చేవారు తగ్గిపోయారట. దాంతో యమధర్మరాజు (కాళుడు) శివుని కోసం తపస్సు చేసి, కాళేశ్వర-ముక్తీశ్వర శివలింగాల రూపంలో ఇక్కడ కొలువై ఉండేలా వరం పొందాడని స్కాంద పురాణం పేర్కొంటోంది. ఈ కారణాలతో కాళేశ్వరాన్ని దక్షిణ కాశీగా వ్యవహరిస్తుంటారు.

ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు

సాధారణంగా ఏ శివాలయంలోనైనా ఒకే పానవట్టం మీద ఒకే శివలింగం కొలువై ఉంటుంది. కానీ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండటం ప్రపంచంలోనే అత్యంత అరుదైన విశేషం! వీటిలో ఒకటి కాళేశ్వర (శివ) లింగం కాగా, రెండోది ముక్తీశ్వర (యమ) లింగం. అంతేకాకుండా, ఈ ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు ప్రవేశ గోపురాలు ఉండటం ఇక్కడి ఆధ్యాత్మిక మహత్యానికి ప్రతీక.

ఈ క్షేత్రంలోని ముక్తీశ్వర లింగానికి రెండు నాసికారంధ్రాలు (ముక్కు రంధ్రాల వంటి నిర్మాణాలు) ఉంటాయి. ఈ రంధ్రాలలో భక్తులు ఎంత నీరు లేదా అభిషేక జలాన్ని పోసినా, ఆ నీరంతా లోపలికి ఇంకిపోయి నేరుగా సమీపంలోని త్రివేణి సంగమంలో కలుస్తుందని ప్రతీతి.

అన్నపూర్ణాదేవి..శుభానందాదేవిగా

 గౌతమ మహర్షి అభీష్టం మేరకు, ముక్తీశ్వర స్వామి ఆదేశ ప్రాకారం సాక్షాత్ కాశీ అన్నపూర్ణాదేవియే ఇక్కడ శుభానందాదేవిగా స్వయంభువుగా వెలిసింది. పరమశివునికి ఎడమవైపున, కనకవర్ణ (బంగారు) ఛాయతో విరాజిల్లుతూ... ముఖంలో మందహాసంతో, తాంబూలం నములుతున్న అరుదైన రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అటు తన ప్రాణనాథుడైన పరమేశ్వరుడిని, ఇటు తనను సేవింపవచ్చే భక్తజనాన్ని అనుగ్రహ వీక్షణాలతో తిలకిస్తున్నట్లుగా అమ్మవారి దివ్య మంగళ రూపం మైమరిపిస్తుంది.

నాలుగు వైపులా నాలుగు దివ్య ద్వారాలు

కాళేశ్వర మహాక్షేత్ర గర్భాలయానికి నాలుగు వైపులా నాలుగు దివ్య ద్వారాలు ఉండటం అత్యంత విశిష్టమైన అంశం. ప్రపంచంలో కాళేశ్వరంతో పాటు కేవలం కాశీలోని విశ్వనాథ ఆలయం, నేపాల్‌లోని పశుపతినాథ ఆలయం గర్భాలయాలకు మాత్రమే ఇలా నాలుగు దిక్కులా ద్వారాలు ఉన్నాయంటే ఈ క్షేత్ర ప్రశస్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా, దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మూడు ప్రధాన సరస్వతి క్షేత్రాలలో కాళేశ్వరం ఒకటి. తెలంగాణలోని బాసర (జ్ఞాన సరస్వతి), జమ్మూ కాశ్మీర్‌లోని బాల సరస్వతి ఆలయాలతో పాటు కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయానికి సమానమైన పౌరాణిక చరిత్ర ఉంది. ఈ మూడు దివ్య సరస్వతి దేవి మూర్తులను సాక్షాత్ ఆది శంకరాచార్యులవారే స్వహస్తాలతో ప్రతిష్ఠించారని స్థల పురాణాలు విశ్వసిస్తున్నాయి.

నందీశ్వరుడి ప్రత్యేకత

ప్రధానంగా ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతి ధ్వజస్తంభంపై అమర్చిన నందీశ్వరుడు ఖగోళ మార్పులకు, సూర్య గమనానికి అనుగుణంగా దక్షిణాయనంలో దక్షిణాభిముఖంగా, ఉత్తరాయనంలో ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు. అంతేకాకుండా, కాళేశ్వరం నాలుగు ద్వారాల (చతుర్ద్వార) గర్భాలయం కావడం వల్ల, నాలుగు దిక్కుల ప్రవేశ ద్వారాలకూ ఎదురుగా నాలుగు నంది విగ్రహాలు కొలువై ఉండటం ఇక్కడి మరొక అరుదైన ఆధ్యాత్మిక విశేషం.

ముక్తీశ్వరుడికి పూజలు నిర్వహిస్తే స్వర్గ లోక ప్రాప్తి

ఈ క్షేత్రంలో మొదట కాళేశ్వరుడికి, ఆ తర్వాత ముక్తీశ్వరుడికి పూజలు నిర్వహిస్తే స్వర్గ లోక ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి పడమర దిశలోని 'యమగుండం' దాటి, సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రాచీన 'ఆది ముక్తీశ్వరాలయం' కొలువై ఉంది. ఈ ఆలయ పరిసరాల్లో నేటికీ ప్రకృతిసిద్ధమైన విభూతి రాళ్లు లభించడం ఇక్కడి అద్భుత ఆధ్యాత్మిక వింతల్లో ఒకటి!  విభూతి రాళ్లను  తీసుకెళ్లి శివారాధనలో ఉపయోగించే సంప్రదాయం ఉంది.

కాకతీయుల కాలంలో విశేష ప్రాధ్యాన్యం

కాళేశ్వర మహాక్షేత్రం కాకతీయ పాలకుల కాలంలో విశేష ప్రాధ్యాన్యం సంతరించుకుంది. కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి (ప్రతాపరుద్ర-1) పరిపాలనా కాలంలో (సా.శ. 1158 – 1195) ఆయన సైన్యాధ్యక్షుడు/మంత్రి అయిన ఎల్లంకి గంగాధరుడు ఈ క్షేత్రానికి విస్తృత నిర్మాణ పనులు చేపట్టి, ఆలయ ప్రాభవాన్ని విస్తరించినట్లు శాసనాధారాలు (నాగునూర్ శాసనం, సా.శ. 1171) పేర్కొంటున్నాయి. రుద్రదేవుడి పాలన నుండి రెండో ప్రతాపరుద్రుడి వరకు (క్రీ.శ. 1158 – 1323) సుమారు 165 సంవత్సరాల పాటు ఈ ఆలయం కాకతీయుల అపరిమిత ఆదరణ పొందినట్లు చారిత్రక శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, క్రీ.శ. 1310లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్, ఆ తర్వాత క్రీ.శ. 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలఘ్‌ఖాన్‌ల దాడిలో ఈ ప్రసిద్ధ ఆలయం తీవ్రంగా లూటీకి గురై నేలమట్టమైంది. దాంతో దాదాపు 650 ఏళ్ల పాటు ఈ పుణ్యక్షేత్రం వెలుగులకు దూరమై చీకటిలోనే మగ్గిపోయింది. చివరకు క్రీ.శ. 1972లో శృంగేరి పీఠాధిపతుల ప్రత్యేక చొరవ, ఆశీస్సులతో కాళేశ్వరం తిరిగి తన పూర్వ వైభవాన్ని సొంతేం చేసుకుంది.

యముడి తపస్సుతో ముడిపడిన క్షేత్రం

కాళేశ్వర క్షేత్ర స్థలపురాణం యమధర్మరాజుతో ముడిపడి ఉంది. స్కంద పురాణానికి సంబంధించిన క్షేత్ర మహాత్మ్య కథనాల ప్రకారం, గోదావరిలో పవిత్ర స్నానం చేసి ముక్తేశ్వరుడిని దర్శించిన వారికి మోక్షం లభిస్తుండటంతో యమలోకానికి చేరే జీవుల సంఖ్య తగ్గిపోయిందట. దీంతో యమధర్మరాజు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేశాడని కథనం. యముడి ప్రార్థనకు ప్రసన్నమైన శివుడు, ముక్తేశ్వర లింగం పక్కనే తనకు సంబంధించిన లింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడని స్థలపురాణం చెబుతుంది. అలా కాళేశ్వర–ముక్తేశ్వరుల సంయుక్త ఆరాధన ఇక్కడ ఏర్పడిందని విశ్వసిస్తారు.

యమకోణం.. మరణభయాన్ని తొలగిస్తుందనే నమ్మకం

కాళేశ్వర క్షేత్రంలో భక్తులను ప్రత్యేకంగా ఆకర్షించే మరో అంశం ‘యమకోణం’. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఇరుకైన 'యమకోణం' మార్గం గుండా దిక్సూచి ఆధారంగా జాగ్రత్తగా బయటకు వస్తే.. యమ దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.  మరణ భయం తగ్గుతుందని, యమధర్మరాజు శిక్షల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

జయ–విజయుల కథ.. సూర్యనారాయణ ఆలయం

ఆలయ గర్భగుడి ముందు కనిపించే జయ–విజయుల విగ్రహాలకు సంబంధించి మరో స్థానిక కథనం ఉంది. కాళేశ్వరం గొప్పదా, కాశీ గొప్పదా అనే విషయంపై వారిద్దరి మధ్య అభిప్రాయభేదం ఏర్పడిందని, దీనికి తీర్పు చెప్పమని సూర్యనారాయణుడిని ఆశ్రయించారని చెబుతారు. కాళేశ్వర ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ఈ కథనంతో అనుసంధానిస్తారు.

ఆలయ ప్రాంగణంలో మరెన్నో దేవతా క్షేత్రాలు

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఒక్క ప్రధాన ఆలయానికే పరిమితం కాదు. ఇక్కడ శుభానంద దేవి, మహాసరస్వతి, శ్రీరాముడు, దత్తాత్రేయుడు, సంగమేశ్వరుడు, సూర్యనారాయణుడు, ఆది ముక్తేశ్వరుడు తదితర దేవతలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆలయ సముదాయం బహుదైవ ఆరాధనా సంప్రదాయానికి ప్రతీకగా కనిపిస్తుంది.

అష్టతీర్థాల పుణ్యభూమి

పురాతన క్షేత్ర సంప్రదాయాల్లో కాళేశ్వరాన్ని అనేక తీర్థాలతో అనుసంధానించారు. బ్రహ్మతీర్థం, చిత్సుఖతీర్థం, వ్యాసతీర్థం, నరసింహతీర్థం, హనుమత్‌తీర్థం, జ్ఞానతీర్థం, పక్షి లేదా వాయసతీర్థం, సంగమతీర్థం అనే అష్టతీర్థాలను ఇక్కడ ప్రస్తావిస్తారు. వీటిలో సంగమతీర్థానికి నదీ సంగమం కారణంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

గోదావరి–ప్రాణహితల సంగమం

కాళేశ్వర క్షేత్రానికి నదీ సంగమం ప్రధాన ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. ఈ సంగమంలో అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా కలుస్తుందని భక్తుల విశ్వాసం. కాళేశ్వరానికి సమీపంలోని మంథని ప్రాంతం గౌతమ మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. గౌతమ మహర్షితో గోదావరి నదికి ఉన్న అనుబంధం కారణంగా గోదావరికి ‘గౌతమి’ అనే పేరు కూడా వచ్చిందని పురాణ సంప్రదాయాలు చెబుతాయి. ఈ నదీ సంప్రదాయం కాళేశ్వర క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాధాన్యంతోనూ ముడిపడి ఉంది.

శని, కాలసర్ప దోష పూజలు

కాళేశ్వర ఆలయంలో వివిధ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. శనివారాల్లో శని పూజలు, మంగళ, గురువారాల్లో కాలసర్ప దోష నివారణ పూజలు నిర్వహించే సంప్రదాయం ఉంది. వీటి ద్వారా దోష నివారణ, శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

కాళేశ్వరం.. పురాణం, నదీ సంగమం, శైవ సంప్రదాయాల కలయిక

ఒకే పానవట్టంపై రెండు లింగాలు.. యమకోణం.. గోదావరి–ప్రాణహిత సంగమం.. అష్టతీర్థాల ప్రస్తావన.. ఆది ముక్తేశ్వరుడు.. మహాసరస్వతీ, సూర్యనారాయణ ఆలయాలు.. ఇలా ఎన్నో విశిష్టతలు కాళేశ్వర క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. పురాణ విశ్వాసాలు, నదీ సంస్కృతి, ప్రాచీన శైవ సంప్రదాయం, ఆలయ వాస్తు–శిల్పకళ ఒకేచోట కలిసిన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాళేశ్వరానికి ప్రత్యేక స్థానం ఉంది.