

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ పరిధిలోని ఖానామెట్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం నెల రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము అక్కడికి వెళ్లి నిర్మాణాలకు రెడ్ మార్క్ వేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. భూగర్భ జలాలు లేని ఖానామెట్ ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. అధికారులు దగ్గరుండి అనుమతులు ఇప్పిస్తూ అక్రమాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోదరులే బిల్డర్లకు అనుమతులు ఇప్పిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. అయ్యప్ప సొసైటీ భూముల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకపోవడంతో నోటరీల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని ఆరోపించారు. పది అంతస్తుల భవనాలు నిర్మించి, వాటిలో పీజీ హాస్టళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఒక్కో భవనం మధ్య కనీసం అగరుబత్తి పట్టేంత స్థలం కూడా ఉండటం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇద్దరు సోదరులకు ఒక్కో విల్లా ఇవ్వడంతో ఆదిత్య బిల్డర్స్‌కు మూసీ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు లభించాయని ఆరోపించారు. తన వద్ద అంగుళం అసైన్డ్ లేదా ఇనాం భూమి ఉన్నా ప్రభుత్వానికే రాసిస్తానని కవిత ప్రకటించారు. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ కరువు మండలాలను ఆదుకునేందుకు ఒక్క రూపాయి సాయం కూడా ప్రకటించలేదని విమర్శించారు. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ నాయకులు నీళ్లు లేని బావిలో దూకాలని వ్యాఖ్యానించారు.