

ప్రభాత ఉదయం, కల్వకుర్తి: చెరువుల పరిరక్షణపై అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయి.. కబ్జాదారులపై చర్యలకొచ్చేసరికి మాత్రం అడుగు ముందుకు పడటం లేదు! చెరువులు బాగుంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పే అధికారులు.. వాటిని ఆక్రమించిన ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరిస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 99లో ఎర్రకుంటను యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించటం లేదు. గతంలో చెరువు ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉందో స్పష్టత లేకపోవడంతో చర్యలు తీసుకోలేకపోయామని అధికారులు చెబుతూ వచ్చారు. అయితే, ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించిన తర్వాత కూడా ఆక్రమణల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
నెల రోజులు గడిచినా..
రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కలిసి ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించారు. దానికి హద్దులను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి నెల రోజులైంది. ఇప్పటికీ కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కిందటే కబ్జాదారులు చెరువు స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. పైగా మున్సిపాలిటీ అధికారులు వాటికి అనుమతులు సైతం ఇచ్చారు.
అక్రమార్జనకు అలవాటు పడి..
బదిలీలపై కల్వకుర్తికి వస్తున్న అధికారులకు ఎర్రకుంట ఆక్రమణలు కాసులు పండిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వారు కబ్జాదారులను పిలిచి.. మాట్లాడి ఆమ్యామ్యాలు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
‘‘రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సూచించిన మేరకు మున్సిపాలిటీ తరఫున హద్దులు ఏర్పాటు చేశాం. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తు తరాలకు ఎర్రకుంటను వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నాం’’ అని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ చెప్పారు.
ఇప్పటికైనా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆక్రమణలను అరికట్టి, ఎర్రకుంటను పరిరక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు.