సన్నబియ్యం.. ధరాభారం

పది నెలల్లో క్వింటాకు రూ.3,000 పెంపు
సన్నబియ్యం.. ధరాభారం
Published on: 

ప్రభాత ఉదయం, కల్వకుర్తి: ‘‘కొన్ని రోజుల నుంచి బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. కిలో రూ.70 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వాటితోపాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.’’ ఇది కల్వకుర్తికి చెందిన సాయిప్రసాద్ ఆవేదన.

సన్నబియ్యం ధరలు సామాన్యులకు పెనుభారంగా మారాయి. ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలు సన్నబియ్యాన్ని కొనుగోలు చేయలేకపోతున్నాయి. పది నెలల్లోనే క్వింటాకు రూ.3,000 వరకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం కిలో రూ.70 నుంచి రూ.80కు విక్రయిస్తున్నారు.

నెలనెలా పెరుగుతూ..

గతేడాది నవంబర్‌లో క్వింటా సన్నబియ్యం ధర రూ.4,400 ఉండగా, ఫిబ్రవరికి రూ.4,600కు చేరింది. ఏప్రిల్‌లో రూ.4,900, జూలైలో రూ.5,500కు పెరిగింది. ఆగస్టు చివరి వారంలో రూ.6,300, సెప్టెంబర్ ఆఖరుకు రూ.7,500 వరకు చేరింది. హమాలీ, రవాణా ఖర్చులు కలిపితే వినియోగదారులకు క్వింటా రూ.7,500 నుంచి రూ.7,800 వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల్లోనే సుమారు రూ.2,500 పెరగడం గమనార్హం.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోజుకు1,400 నుంచి 1,600 క్వింటాళ్ల బియ్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో వినియోగదారులపై రోజుకు సుమారు రూ.17 లక్షల అదనపు భారం పడుతోంది.‘‘20 ఏళ్లుగా బియ్యం వ్యాపారం చేస్తున్నా ఇంతటి పెరుగుదలను ఎప్పుడూ చూడలేదు’’ అని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు.

సాగు తగ్గి.. ఎగుమతులు పెరిగి..

ఉమ్మడి మహబూబ్‌ నగర్  జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, కాల్వలకు నీరు విడుదలైన తర్వాత నాలుగు లక్షల ఎకరాల్లోనే సాగు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సన్నరకం ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా కర్ణాటకలో డిమాండ్‌ ఉండటంతో ఎగుమతులు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. పాఠశాలలు, వసతిగృహాల అవసరాలకూ వినియోగిస్తుండటంతో మార్కెట్‌ నిల్వలపై ప్రభావం చూపుతోందని వ్యాపార వర్గాలు  అభిప్రాయపడుతున్నాయి. వీటిని సాకుగా చేసుకుని కొందరు వ్యాపారులు ధరలు పెంచుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి.. కృత్రిమ కొరతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.