బియ్యం బస్తాల్లో తూకం మాయాజాలం.. కర్మన్‌ఘాట్‌లో అధికారుల మెరుపు దాడులు!

రంగారెడ్డి జిల్లా పరిధిలోని కర్మన్‌ఘాట్‌లోని రిటైల్‌, హోల్‌సేల్‌ బియ్యం దుకాణాలలో సివిల్‌ సప్లైస్‌, విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు..
Karmanghat rice shops inspection
కర్మన్‌ఘాట్‌లో బియ్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సివిల్‌ సప్లైస్‌, విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు
Published on: 

ప్రభాత ఉదయం, ఎల్బీ నగర్ : బియ్యం బస్తాపై ఒక తూకం.. తూకం వేస్తే మరో లెక్క! రేషన్‌ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలు.. బస్తాలపై ముద్రించిన బరువు కంటే తక్కువగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు.. ఈ అక్రమాలపై రంగంలోకి దిగిన అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కర్మన్‌ఘాట్‌లో సివిల్‌ సప్లైస్‌, విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు గురువారం సంయుక్తంగా మెరుపు తనిఖీలు నిర్వహించారు.

10కి పైగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు

కర్మన్‌ఘాట్‌లోని రిటైల్‌, హోల్‌సేల్‌ బియ్యం దుకాణాలపై సుమారు 10 నుంచి 12 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. శుభం ట్రేడర్స్‌, లక్ష్మీనరసింహ ట్రేడర్స్‌, కేఎల్‌ ట్రేడర్స్‌ తదితర రైస్‌ డిపోల్లో తనిఖీలు చేపట్టారు. కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్‌ ఎస్పీ రామ్‌కుమార్‌, సిద్ధేశ్వర్‌రావు, ఎల్బీనగర్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. కొన్ని దుకాణాల నిర్వాహకులు తనిఖీల సమయంలో షాపులు మూసివేసి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు.

26 కిలోల బస్తాలో 24–25 కిలోలే!

బియ్యం ప్యాకెట్లపై 26 కిలోలుగా ముద్రించి ఉన్నప్పటికీ, తూకం వేయగా కొన్ని సంచుల్లో 24 నుంచి 25 కిలోల వరకే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని ప్యాకెట్లలో పేర్కొన్న బరువు కంటే 20 నుంచి 30 గ్రాముల వరకు తక్కువగా ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో వినియోగదారులకు నిర్ణీత పరిమాణంలో బియ్యం అందుతున్నాయా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలన చేపట్టారు. పలు దుకాణాల్లో బియ్యం నమూనాలను కూడా సేకరించారు.

రేషన్‌ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చుతున్నారా?

రేషన్‌ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు. తనిఖీల్లో ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా కొన్ని డిపోలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆరోపణలకు సంబంధించి సేకరించిన నమూనాలు, రికార్డుల ఆధారంగా తదుపరి విచారణ చేపట్టనున్నారు.

జీఎస్టీ, బిల్లులపైనా ఆరా

బియ్యం ప్యాకెట్లపై నెట్‌ క్వాంటిటీ, కంపెనీ పేరు, ఇతర తప్పనిసరి వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలించారు. జీఎస్టీ పత్రాలు, సరుకు రవాణాకు సంబంధించిన వే-బిల్లులు, సరఫరా లారీల బిల్లులను తనిఖీ చేశారు. తూకంలో తేడాలు, ప్యాకేజింగ్‌ నిబంధనల ఉల్లంఘనలు లేదా ఇతర అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం: విజిలెన్స్‌ ఎస్పీ

కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో ఈ ఏడాది సుమారు 30 నుంచి 35 వరకు తనిఖీలు నిర్వహించినట్లు విజిలెన్స్‌ ఎస్పీ రామ్‌కుమార్‌ తెలిపారు. నిత్యావసరాల సరఫరాలో అక్రమాలను అరికట్టడం, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే పరిస్థితులను నివారించడం తనిఖీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. వినియోగదారులు కొనుగోలు చేసే బియ్యం ప్యాకెట్లపై ముద్రించిన బరువును పరిశీలించాలని, తూకంలో తేడాలు కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.