

ప్రభాత ఉదయం, జయశంకర్ భూపాలపల్లి: కన్నెపల్లి వద్ద కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రాణహిత నది ప్రవాహాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ప్రాణహిత నది నుంచి రోజుకు రెండు టీఎంసీల నీరు ప్రవహిస్తూ దిగువకు వెళ్తోందని తెలిపారు. బ్యారేజీలు మరమ్మతుల్లో ఉన్నాయనే కారణంతో మూడేండ్లుగా వేల టీఎంసీల నీటిని వృథా చేశారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోలేదని అన్నారు. సుమారు రూ.25 కోట్లతో నెలన్నర రోజుల్లో పనులు పూర్తి చేసి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని బైపాస్ చేస్తూ నీటిని రిజర్వాయర్లకు తరలించవచ్చని తెలిపారు.
ఆందోళన చేపడుతాం..
ప్రభుత్వం వెంటనే కాఫర్ డ్యాం నిర్మాణం నవంబర్ నెలాఖరులోగా చేపట్టకపోతే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఆందోళన చేస్తామని కవిత హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామన్నారు. అన్ని పార్టీలు ఈ సమస్యపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.