ఖమ్మం జిల్లాలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం

మురసు, ఆర్నాబ్ తుఫాన్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 23,140 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. 11,192 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేసింది.
ఖమ్మం జిల్లాలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం
Published on: 

ప్రభాత ఉదయం, ఖమ్మం ప్రతినిధి : మురసు తుఫాన్​ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మరికొద్ది రోజుల్లో చేతికొస్తుందనుకున్న వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. మిర్చి తోటలు వర్షం దాటికి దెబ్బతిన్నాయి. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 23,140 ఎకరాల్లో దెబ్బతినగా, 11,192 మంది రైతులు నష్టపోయినట్లు తేలింది.

19 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి

వారం రోజులు వ్యవధిలో ఆర్నాబ్, మురసు తుఫానుల కారణంగా భారీ వర్షాలు కురవడంతో ఖమ్మం నియోజకవర్గంలో 475 ఎకరాలు, పాలేరులో 1,396 ఎకరాలు, మధిరలో 2,118 ఎకరాలు, సత్తుపల్లిలో 13,290, వైరాలో 2,301 ఎకరాలతో కలిపి 19,580 ఎకరాల్లో వరి దెబ్బతినగా, 9,294 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. ఇక సత్తుపల్లిలో 500 ఎకరాలు, వైరాలో 241 ఎకరాలతో కలిపి 741 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతినగా, 446 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఖమ్మంలో 135 ఎకరాలు, పాలేరులో 220 ఎకరాలు, మధిరలో 547 ఎకరాలు, సత్తుపల్లిలో 1,393 ఎకరాలు, వైరాలో  368 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతినగా, 1384 మంది రైతులు నష్టపోయారు. 156 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతినగా, 69 మంది రైతులు నష్టపోయారు. మరో రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి పూర్తి స్థాయిలో నష్టం వివరాలు నమోదు చేస్తామని జేడీఏ తెలిపారు.

సమగ్ర సర్వేకు విపక్షాల డిమాండ్​

ఖమ్మం జిల్లాలో ఆర్నాబ్, మురసు తుఫానులతో నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఉమ్మడి జిల్లా రైతాంగానికి అండగా ఉంటామని తెలిపారు. పంట నష్టంపై సమగ్ర సర్వే చేపట్టాలని బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్​ మాస్​లైన్​ నేతలు కోరారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని, తడిసిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.