

ప్రభాత ఉదయం, వైరా : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్లో పెసర్లు అమ్మేందుకు తీసుకొచ్చిన రైతులు ధాన్యం కాంటా కాకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అక్కడే నిరీక్షించాల్సి వస్తుంది. నాణ్యత సాకుతో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ సమయం వృథా అవుతుందని, యార్డు వద్ద రోజువారీ ఖర్చులు భారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. తాగునీరు, నీడ సదుపాయం లేక ఎండకు అల్లాడిపోతున్నామని పేర్కొంటున్నారు. కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఏ క్షణంలో వచ్చి బస్తాలపై దాడి చేస్తాయోనని భయంగా ఉందని వాపోతున్నారు. ‘నెల రోజులుగా ఇక్కడే ఉంటున్నాం. పంటను కాపాడుకోలేక, ఇంటికి వెళ్లలేక ఇబ్బందిపడుతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి పెసర కొనుగోళ్లు చేపట్టాలి’ అని రైతులు కోరుతున్నారు.