ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భవిత సెంటర్లు సొంత భవనాలు, సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సొంత భవనాలు 12, ప్రభుత్వ స్కూల్ క్యాంపస్‌లలో 52 భవిత సెంటర్లు నడుస్తున్నాయి. వీటిల్లో మొత్తం 655 మంది పిల్లలు ఉన్నారు. మానసిక, శారీరక వైకల్యాలకు గురైన పిల్లలు ఈ భవిత సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. కానీ, వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏ సెంటర్లలో కూడా పూర్తి స్థాయిలో లేవు. ముఖ్యంగా ఫిజియోథెరఫీకి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ చాలా సెంటర్లలో లేవు. ఫిజియోథెరఫీకి సంబంధించిన శిక్షకులు కూడా లేరు. దీంతో చాలామంది స్పెషల్ చిల్డ్రన్‌ను వారి పేరెంట్స్ ప్రైవేట్ ఫిజియోథెరఫీ సెంటర్లకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా భవిత సెంటర్లకు అవసరమైన సొంత బిల్డింగులు, పరికరాలు సమకూర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్పెషల్ ట్రైనింగ్ తీరు...
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు భవిత సెంటర్లలో ఇస్తున్న శిక్షణ తీరు మంచి ఫలితాలు ఇస్తున్నది. చాలామంది పిల్లలు వివిధ కారణాలతో మాట్లాలేకపోతున్నారు. అలాంటి వారికి మాట్లాడటం, అక్షరాలు గుర్తించడం, పిక్చర్స్ గుర్తుపట్టడం, వాటిని నోటితో పలికించడం వంటి విధానాలతో శిక్షణ ఇస్తున్నారు. స్పీచ్ థెరఫీ, ఫిజియోథెరఫీ ద్వారా ఆయా క్యాటగిరీ పిల్లలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయిస్తూ వారిని మామూలు పిల్లలకు దీటుగా తయారు చేస్తున్నారు. డాక్టర్ల సలహాలతో వీల్‌చైర్, ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, అంధుల కోసం సహాయక కర్రలు వంటివి అందించాలి. భవిత సెంటర్లలో చేరిన పిల్లలకు, వారి హెల్పర్స్‌కు నెలకు రూ. 500 చెల్లిస్తున్నారు. కానీ, చాలా సెంటర్లలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్పీచ్, ఫిజియో థెరఫీలకు సంబంధించిన ఎక్విప్మెంట్ లేదనే ఆరోపణలున్నాయి. అలాగే చాలినన్ని వీల్‌చైర్స్, ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలు, అంధులకు కావాల్సిన హెల్పింగ్ స్ట్కిక్స్ కూడా అందుబాటులో లేవని తెలుస్తున్నది.
సౌకర్యాలు కల్పించాలి: పేరెంట్స్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సొంత బిల్డింగ్స్ ఉన్న భవిత సెంటర్లు 12 మాత్రమే.ప్రభుత్వ స్కూల్ క్యాంపస్‌లలో ఉన్నవి 52.మొత్తం సెంటర్లలో 655 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు శిక్షణ పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 2 సొంత భవనాలతో భవిత సెంటర్లు నడుస్తున్నాయి. అలాగే 15 సెంటర్లు ఆయా ప్రభుత్వ స్కూల్ క్యాంపస్‌లలో నడుస్తున్నాయి. ఇందులో 147 మంది స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 4 సొంత భవనాలు, 12 స్కూల్ క్యాంపస్‌లలో ఉండగా, వీటిల్లో మొత్తం 430 చిల్డ్రన్ ఉన్నారు. సిరిసిల్లలో 3 ఓన్, 10 స్కూల్ క్యాంపస్, కాగా స్పెషల్ చిల్డ్రన్100 మంది ఉన్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో 3 ఓన్ బిల్డింగ్స్ ఉండగా, 15 స్కూల్ క్యాంపస్‌లలో నడుస్తున్నాయి. వీటిలో 188 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. కానీ, స్కూల్ క్యాంపస్‌లలో నడుస్తున్న భవిత సెంటర్లకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదు. కనీసం భవిత సెంటర్ అనే బోర్డు కూడా రాయించలేని పరిస్థితి ఉంది. సొంత భవనాలను ఏర్పాటు చేయకుండా మరమ్మతులు చేయించి చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.