విమర్శే తప్పా.. దురుద్దేశం లేదు.. కేటీఆర్ పై వ్యాఖ్యలకు చింతిస్తున్నా : కొండా సురేఖ

కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలు వారిని, వారి కుటుంబ సభ్యులను నొప్పించి ఉంటే చింతిస్తున్నానని మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.
Konda Surekha apology to KTR
కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు.
Published on: 

ప్రభాత ఉదయం, వరంగల్​ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్​పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రకటించారు. ‘నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అంటూ గురువారం ‘ఎక్స్​’ వేదికగా వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో మాట్లాడానే తప్పా, ఉద్దేశపూర్వకం కాదన్నారు. నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిదంటూ విచారం వ్యక్తం చేశారు.

మంత్రిగా ఉన్నపుడు వ్యాఖ్య

సురేఖ రాష్ట్ర దేవాదాయ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్​తో పాటు  ఓ సినీ నటి, ఒక నటుడి కుటుంబాన్ని  ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు అప్పట్లో సంచలం సృష్టించాయి. సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. ఆమెపై రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

బర్తరఫ్ తర్వాత భిన్న చర్చ

సురేఖను రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత పలు చర్చలు, ఊహాగానాలు సాగాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలను ఎదుర్కొంటారని, బీజేపీలోకి పోతున్నారని, బీఆర్ఎస్​లో చేరుతారనే ఊహాగానాలు సాగాయి. ఈ దశలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమంటూ, తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని సురేఖ స్పష్టం చేశారు. సురేఖ తాజా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీతో పాటు, ఇతర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. పార్టీ మార్పు ఉద్దేశాలున్నాయా? తమ రాజకీయ భవిష్యత్​ కోసం బీఆర్ఎస్​కు దగ్గరవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.