

కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అభయమిచ్చే ఆపద్బాంధవుడు..పిలిస్తే పలికే దేవుడు.. నరసింహుడి ఉగ్రతేజస్సు, ఆంజనేయుడి సౌమ్యత్వం ఒకే దైవస్వరూపంలో దర్శనమిచ్చే పవిత్ర క్షేత్రం కొండగట్టు! ఈ స్వయంభుగా వెలిసిన శ్రీ అంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని అత్యంత ప్రాచీన, మహిమాన్విత పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అనారోగ్యాలు, గ్రహదోషాలు, చేతబడుల భయాల నుంచి భక్తులను రక్షించే ఈ అంజన్న క్షేత్రం వెనుక ఉన్న స్థలపురాణం, ఆ స్వామి మహిమల సమాహారమే ఈ ప్రత్యేక కథనం...
ఉమ్మడి కరీంనగర్, ప్రస్తుత జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులోని కొండగట్టు కొండపై కోరంద పొదల మధ్య ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశారు. ఈ క్షేత్రంలోని స్వామివారి దైవస్వరూపం మిగతా ఆంజనేయ ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. ఒకవైపు నరసింహస్వామి ముఖం, మరోవైపు ఆంజనేయస్వామి ముఖం కనిపించే ఈ ద్విముఖ రూపం ప్రత్యేక ఆకర్షణ. నరసింహుడు విష్ణువు అవతారంగా భావించబడటంతో, కొండగట్టు అంజన్నకు శంఖం, చక్రంతోపాటు వక్షస్థలంలో సీతారాములు కొలువై ఉండటం ఈ క్షేత్రంలోని విశిష్టత. దీంతో హనుమంతుడి భక్తి, విష్ణుతత్త్వం ఒకే దైవస్వరూపంలో దర్శనమిచ్చే అరుదైన క్షేత్రంగా కొండగట్టు ప్రసిద్ధి చెందింది.
160 ఏళ్ల క్రితం పునర్నిర్మాణం..
ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ పునరుద్ధరించి నిర్మించినట్లు సమాచారం. ప్రధాన ఆలయంలో అంజన్నను దర్శించుకున్న తర్వాత కొండపై ఉన్న ఇతర విశేష ప్రదేశాలను కూడా చూడొచ్చు. కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటి ధార, కొండలరాయుడి గుట్ట వంటి ప్రదేశాలు ఈ క్షేత్ర దర్శనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్షేత్రపాలకుడిగా కొలువైన భేతాళ స్వామి సన్నిధి దుష్టశక్తుల నివారణకు, నరదృష్టి, మానసిక ప్రశాంతత కోసం భక్తులు తప్పక దర్శించే ప్రదేశం. లంక నుంచి తిరిగొచ్చే క్రమంలో లేదా వనవాస సమయంలో సీతాదేవి ఇక్కడ కూర్చుని తన కష్టాలను తలచుకుని కన్నీరు పెట్టుకుందని, ఆ గుర్తులు రాతిపై ఇప్పటికీ కనిపించే ఈ ప్రదేశం భక్తులలో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. చారిత్రక ఆనవాళ్లు, కోటగోడల బురుజులు, ప్రకృతి అందాలతో కూడిన కొండల రాయుడి గుట్ట కొండగట్టు ప్రాచీన చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.
సంజీవుడికి స్వప్నంలో దర్శనం..!
స్థలపురాణం ప్రకారం.. సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం సింగం సంజీవుడు కొండగట్టు ప్రాంతంలో ఆవులను మేపుతుండేవాడు. ఒకరోజు అతని మందలోని ఓ ఆవు తప్పిపోవడంతో దాని కోసం కొండంతా వెతికాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో ఓ చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడట. ఆ సమయంలో స్వామివారు అతని కలలో ప్రత్యక్షమై.. “నేను కోరంద పొదల్లో ఉన్నాను. ఎండ, వాన, ముళ్ల నుంచి నాకు రక్షణ కల్పించు. నీ ఆవు కూడా ఇక్కడే ఉంది” అని చెప్పినట్లు కథనం.
సంజీవుడు మేల్కొని చూడగా ఆవు కనిపించిందట. వెంటనే స్వామి చెప్పినట్లుగా కోరంద పొదలను తొలగించి చూడగా..శంఖం, చక్రం, గద వంటి ఆయుధాలతో కూడిన ఆంజనేయస్వామి విశ్వరూపం దర్శనమిచ్చిందని స్థలపురాణం చెబుతోంది. దీంతో అక్కడే స్వామివారికి ఆలయం నిర్మించాడని చెబుతారు. ఆలయ దక్షిణ భాగంలోని శిలాక్షరాలు ఈ ఆవిర్భావ కథకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాయని స్థానిక కథనాలు పేర్కొంటాయి.
కొండల్రాయుడి కథ!
కొండగట్టు క్షేత్రానికి మరో చారిత్రక ప్రత్యేకతగా చిన్న కోటగోడలను తలపించే ప్రహరీ నిర్మాణాలు కనిపిస్తాయి. మూడు విభిన్న ప్రహరీలతో కూడిన ఈ నిర్మాణాలను కొండల్రాయుడు నిర్మించాడని స్థానిక చరిత్ర చెబుతోంది. స్వామి భక్తుడైన చిలుమూరి రఘుపతిరావు హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన కుమారుడు కొండల్రాయుడు కోట, బురుజులను నిర్మించి సైన్యాన్ని సమకూర్చుకున్నాడని కథనం. నేటికీ కొండపై కోట గోడల ఆనవాళ్లు, గుర్రపు అడుగుల గుర్తులు, కొలను గుంటలు కనిపిస్తాయని చెబుతారు. దీంతో కొండగట్టు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా, గత చరిత్ర ఆనవాళ్లను కూడా తనలో దాచుకున్న ప్రదేశంగా ప్రత్యేకతను సంతరించుకుంది.
కొండగట్టు పేరు ఎలా వచ్చింది?
కొండగట్టు అంజన్న ఆలయం నల్లరాతి బండలు, సహజ గుహలు, అనేక రకాల వృక్షజాతులతో కూడిన కొండ ప్రాంతంలో ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు.. వాటి మధ్య మరో చిన్న గుట్ట ఏర్పడి, దానిపై ఆంజనేయస్వామి కొలువైనందున ఈ ప్రాంతానికి ‘కొండగట్టు’ అనే పేరు వచ్చిందని ఒక స్థానిక కథనం చెబుతోంది. మరో విశ్వాసం ప్రకారం.. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్న ఆంజనేయుడి చేతిలో నుంచి ఆ పర్వతంలోని కొంత భాగం ఇక్కడ పడిందట. అందుకే ఈ కొండలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడిందని పూర్వీకుల నమ్మకం.
ఈ విశ్వాసం కారణంగానే శారీరక, మానసిక బాధలు, గ్రహబాధలు ఉన్నవారు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఆలయానికి సమీపంలో రాతిబండల మధ్య సుమారు 30 గజాల లోతైన పుష్కరిణి ఉంది. గతంలో తపస్వులు ఇందులో స్నానాలు ఆచరించి, సమీపంలోని గుహల్లో తపస్సు చేసేవారని స్థానిక కథనాలు చెబుతున్నాయి.
ఒకే మంటపంలో మూడు గర్భగుడులు..
కొండగట్టు ఆలయ నిర్మాణంలోనూ ప్రత్యేకత కనిపిస్తుంది. ఒకే మంటపంలో మూడు వేర్వేరు గర్భగుడులు ఉండటం విశేషం. మధ్యలో ఆంజనేయస్వామి, కుడివైపు వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులు, ఎడమవైపు అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయానికి పడమర దిశలో క్షేత్రపాలకుడైన భేతాళస్వామి సన్నిధి ఉంది. ఆయనకు దక్షిణంగా రామపాదుకలు దర్శనమిస్తాయి. కొంత దూరంలో పొలిమేర దేవతగా భావించే బొజ్జ పోతన్న సన్నిధి కూడా ఉంది.
రామపాదుకలకు సమీపంలో సీతా పతివ్రతా తల్లి కూర్చుని తన కష్టాలను తలచుకుని కన్నీరు పెట్టుకున్నదని స్థానిక స్థలపురాణం చెబుతుంది. ఆమె కన్నీటి గుర్తులు కూడా అక్కడ కనిపిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇలా ప్రకృతి, పురాణ విశ్వాసాలు, ఆలయ నిర్మాణం, స్థానిక చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను తనలో మిళితం చేసుకున్న క్షేత్రంగా కొండగట్టు ప్రత్యేకతను సంతరించుకుంది.
ఐదు వందల ఏళ్లుగా నిత్యహారతులు..
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో సుమారు ఐదు వందల ఏళ్లుగా నిత్యహారతులు కొనసాగుతున్నాయని క్షేత్ర సంప్రదాయాలు చెబుతున్నాయి. అనారోగ్యాలు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు, మానసిక ఆందోళనలతో ఉన్నవారు స్వామి సన్నిధిలో 11, 21, 41 రోజులపాటు నిష్టతో పూజలు, మూడుపూటలా భజనలు చేస్తుంటారని భక్తుల విశ్వాసం. బేతాళస్వామి ఆలయం వద్ద గ్రహబాధల నుంచి విముక్తి కోరుతూ భక్తులు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడి విగ్రహానికి నమస్కరించి, అల్లుబండను ఆలింగనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహంతో బాధలు తొలగుతాయని నమ్ముతారు. కొందరికి స్వామివారు కలలో దర్శనమిచ్చి గ్రహబాధ నుంచి విముక్తి కలిగిస్తారని కూడా భక్తులు చెబుతుంటారు.
చిన్న జయంతి.. పెద్ద జయంతి.. వైభవంగా హనుమాన్ ఉత్సవాలు!
కొండగట్టు క్షేత్రంలో ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలను చైత్ర పౌర్ణమి రోజున ‘హనుమాన్ చిన్న జయంతి’గా, వైశాఖ బహుళ దశమి రోజున ‘హనుమాన్ పెద్ద జయంతి’గా నిర్వహించడం ప్రత్యేకత. పెద్ద జయంతి సందర్భంగా త్రయాహ్నిక, త్రికుండాత్మక మహాయాగాలతో పాటు మూడు రోజులపాటు స్వామివారికి ప్రత్యేక పంచామృతాభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో దీక్షా భక్తులు కొండగట్టుకు చేరుకుంటారు. సుమారు 3 నుంచి 5 లక్షల మంది దీక్షాపరులు స్వామివారిని దర్శించుకుని, తమ దీక్షను విరమిస్తారు.
గండ దీపం.. నిరంతర జ్యోతి
కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించే "గండ దీపం" సమర్పణ భక్తుల విశ్వాసంలో అత్యంత మహిమాన్వితమైన పూజా విధానంగా పరిగణించబడుతుంది. జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద గండాలు, తీవ్రమైన ఆపదలు, అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందడానికి భక్తులు స్వామివారికి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ‘గండం’ అంటే మృత్యుభయం, తీవ్రమైన ప్రమాదం, ఆపద లేదా జీవితాన్ని కుదిపేసే సమస్య అని అర్థం. తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు జాతకంలో గండాలు ఉన్నాయని తెలిసినప్పుడు, లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు భక్తులు "కొండగట్టు అంజన్న నీ సన్నిధిలో గండ దీపం వెలిగిస్తాం.. ఆపద నుండి కాపాడు స్వామీ" అని మొక్కుకుంటారు. గండాల నుంచి గట్టెక్కించే దైవంగా కొండగట్టు అంజన్నకు ఉన్న ప్రసిద్ధి వల్ల ఈ దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. కొండగట్టులో వెలిగే అఖండ దీపానికి, భక్తులు వెలిగించే గండ దీపాలకు అనుబంధం ఉంది. గండ దీప సమర్పణతో పాటు, అక్కడి అఖండ దీపం నుంచి ఇచ్చే నూనె ప్రసాదాన్ని (గురుస్వాములు లేదా అర్చకులు ఇచ్చే ప్రసాదం) నుదుట తిలకంగా ధరించడం, లేదా అనారోగ్యంతో ఉన్న భాగంలో రాసుకోవడం వల్ల అంతుచిక్కని రోగాలు సైతం నయమవుతాయని భక్తుల దృఢమైన విశ్వాసం.