

ప్రభాత ఉదయం, రంగారెడ్డి జిల్లా : కన్నబిడ్డపై క్షణికావేశం కర్కశత్వంగా మారింది. మొబైల్ ఎక్కువగా వాడొద్దని, తన మాట వినాలని చెప్పినా వినడం లేదనే కోపంతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. 14 ఏళ్ల కన్నకూతురి గొంతు నులిమి ప్రాణం తీసింది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదికతో అసలు విషయం బయటపడింది. చివరకు కన్నకూతురిని హత్య చేసిన తల్లి కటకటాలపాలైంది. ఈ హృదయవిదారక ఘటన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరులో చోటుచేసుకుంది. కొత్తూరు పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాద్నగర్ జోన్ డీసీపీ సి. శిరీష రాఘవేంద్ర, ఏసీపీ పి. లక్ష్మీనారాయణ కేసు వివరాలను వెల్లడించారు.
మొబైల్ విషయంలో తరచూ గొడవలు
కొత్తూరు హనుమాన్ టెంపుల్ కాలనీకి చెందిన ముయ్యాది విజయలక్ష్మి (34)కు 14 ఏళ్ల కుమార్తె ఉంది. కూతురు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తోందని, తన మాట వినడం లేదని తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అక్టోబర్ 27న మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి.. క్షణికావేశంలో కూతురి గొంతు నులిమి హత్య చేసింది.
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
కూతురిని చంపిన అనంతరం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు విజయలక్ష్మి మరో ప్రయత్నం చేసింది. చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించింది. తొలుత బాలిక మరణాన్ని ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఘటనాస్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోస్టుమార్టంతో బయటపడిన అసలు నిజం
పోస్టుమార్టం నివేదికలో బాలిక గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు అనుమానాన్ని బలపరిచే ఆధారాలను సేకరించి తల్లి విజయలక్ష్మిని విచారించారు. ఈ క్రమంలో తానే కూతురిని హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. దీంతో నిందితురాలిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్హెచ్వో, ఇన్స్పెక్టర్ బి. నాగార్జున రెడ్డితో పాటు కొత్తూరు పోలీస్ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు.