

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : తెలంగాణలో రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ శాఖలకు ఏఐని అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. నానక్‌రామ్‌గూడలోని ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన క్యాంపస్ హబ్ ఏఐ ఉత్పత్తి ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కలిసి కొత్తగా క్యాంపస్ హబ్ ఏఐని ప్రారంభించడం గొప్ప విషయమని కొనియాడారు. గతంలో తెలంగాణలో ఐటీ రంగానికి ప్రయారిటీ ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. ‘ఏఐ భూతం కాదు.. మానవాళికి దూతం లాంటిది’ అని అభివర్ణించారు. గతంలోనే వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. సిరిసిల్లలోని ఓ గ్రామంలో ఏఐ ఆధారిత వ్యవసాయ ప్రాజెక్టును చేపట్టామని గుర్తుచేశారు. ఐటీ కంపెనీల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. పరకాలలో రాకేశ్ అనే యువకుడు ఐటీ కంపెనీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.