మూసీకి రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు? ఆ నిధులతో ప్రజలను ఆదుకోవాలి: కేటీఆర్‌

మూసీ సుందరీకరణ ప్రాజెక్టును వెంటనే ఆపి, రూ.లక్షన్నర కోట్లతో ప్రజలను ఆదుకోవాలని బీఆర్ఎస్​ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
మూసీకి రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు? ఆ నిధులతో ప్రజలను ఆదుకోవాలి: కేటీఆర్‌
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ‘‘ఓ వైపు పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకు?, ఆ ప్రాజెక్టును వెంటనే ఆపి, రూ.లక్షన్నర కోట్లతో ప్రజలను ఆదుకోవాలి. ఆరు గ్యారెంటీలు, క్రాప్, పవర్, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు కాంగ్రెస్​ హాలిడే ప్రకటించింది” అని ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్​ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. అన్నింటికీ హాలిడే ఇచ్చిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు తప్పకుండా హాలిడే ఇస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గురువారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. నాడు రైతు డిక్లరేషన్లు ప్రకటించి.. ఇప్పుడు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరేటర్లు, ట్యాంకర్లతో రైతులు తమ పంటల్ని కాపాడుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు విడతల రైతుబంధు ఇవ్వాలి

కరువుతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. ‘రైతుబంధును మూడు విడతలుగా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ యాసంగి సీజన్​ను కలుపుకొని నాలుగు విడతల డబ్బులు రైతులకు ఇవ్వాలి. అంటే ఎకరానికి రూ.60 వేల లెక్కన నిధులిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. విద్యుత్ కోతలను నివారించాలి” అని కోరారు. సాగు నీళ్లు లేక, కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారని, రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్​ వేశారని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా, తాగునీటి ఎద్దడి ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు కేటాయించి దానిపై దృష్టి పెట్టడం విచిత్రంగా ఉంది. డీపీఆర్ లేకుండానే రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు. ఎవరికీ ఎలాంటి లాభం లేని ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలి. ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి, రైతుల కోసం వినియోగించాలి’’ అని డిమాండ్​ చేశారు.

చంద్రబాబుపై ప్రశంసలు​

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగి మూడేళ్లు అవుతున్నా, విచారణ జరపకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. రైతులకు నీళ్లు అందించకుండా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని అన్నారు. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని, ప్రకృతి తెచ్చిన కరువు కాదని విమర్శించారు. దిగువనున్న ఆంధ్రప్రదేశ్ కఠిన పరిస్థితుల్లోనూ జలాశయాలను నింపుకొని రైతులను ఆదుకుందన్న కేటీఆర్​.. సీఎం చంద్రబాబును కొనియాడారు. తెలంగాణ కంటే రెండు రెట్ల లోటు వర్షపాతమున్న కర్ణాటకలోనూ ఇంత తీవ్రమైన కరువు లేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించడం వల్ల పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలతో ఇండస్ట్రీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పరిస్థితులు, పరిపాలనా వైఫల్యంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ అధిష్ఠానం ఇప్పటివరకు స్పందించలేదన్నారు. రాష్ట్రం కరువు, కరెంట్ కోతలతో తల్లడిల్లుతుంటే ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెట్టుబడి, ఉద్యోగం తీసుకురాలేకపోయిందన్నారు.

పెట్టుబడులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం గడచిన మూడేళ్ళల్లో చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన ఎంఓయూలు, వచ్చిన పెట్టుబడులు, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో చేస్తున్న ప్రచారానికి, రాష్ట్రానికి వచ్చిన వాస్తవ పెట్టుబడులకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించాలన్నారు. తాము ఎలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగామని కేటీఆర్ అన్నారు.