పంటలు.. ప్రాణాలకూ ముప్పు

వన్యప్రాణుల దాడులతో గిరిజన రైతుల బెంబేలు
Wild boar attacks in Adilabad
Wild boar attacks in Adilabad
Published on: 

ప్రభాత ఉదయం, ఆదిలాబాద్:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల దాడులు గిరిజన రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అడవి జంతువుల బెడదతో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవి పందులు రైతులపై దాడులు చేస్తుండటంతో వ్యవసాయ పనులు చేయడానికే భయపడే పరిస్థితి నెలకొంది.

ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ మండలాలైన లింగాపూర్, సిర్పూర్(యు), జైనూర్, కెరమెరి, వాంకిడి, తిర్యాణి, బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికలపేట, సిర్పూర్(టి) ప్రాంతాల్లో అడవి పందులు పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటలకు తీవ్ర నష్టం చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇటీవల గోయగాం వద్ద పొలం నుంచి తిరిగి వస్తున్న రైతుపై అడవి పందుల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నార్నూర్, గాదిగూడ ప్రాంతాల్లో పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇంద్రవెల్లి మండలంలో పొలానికి మందు పిచికారీ చేసేందుకు వెళ్లిన ఆదివాసీ యువకుడిపై అడవి పంది దాడి చేసి గాయపరిచింది.

మంచిర్యాల జిల్లాలో  గతేడాది కన్నెపల్లి మండలం సుర్జాపూర్‌లో పత్తి పొలాన్ని పరిశీలిస్తున్న సమయంలో అడవి పంది దాడిలో ఒక రైతు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.  నిర్మల్ జిల్లాలో పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి రైతు మృత్యువాతపడ్డాడు.

నిద్రలేని రాత్రులు

పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రివేళల్లో టార్చ్‌లైట్లతో పొలాల్లో కాపలా కాస్తున్నారు. శబ్దాలు చేయడం, కంచెల ఏర్పాటు చేస్తున్నా వన్యప్రాణుల బెడద తగ్గడం లేదని చెబుతున్నారు. మరోవైపు పంట నష్టపరిహారం అందడం ఆలస్యమవుతోందని పలువురు రైతులు వాపోతున్నారు.

‘‘ఇప్పటికే వర్షాల లోటుతో ఈసారి ఆశించినంతగా పంట దిగుబడి లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అడవి పందులు, కోతులు పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. అడవి జంతువులకు ఏదైనా హాని తలపెడితే ఫారెస్ట్ అధికారులు కేసులు పెడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అర్ధరాత్రి టార్చ్‌లైట్ పట్టుకొని కాపలాకు వచ్చాం. అధికారులే మాకు ఏదైనా దారి చూపించాలి.'' అని రైతు మడవి రవీందర్ కోరుతున్నారు.

పంటను కాపాడుకోకపోతే పెట్టుబడి మొత్తం నష్టపోయే పరిస్థితి. వన్యప్రాణులను సంరక్షించడంతో పాటు ప్రాణాలు, పంటలను కాపాడటానికి పరిష్కారం చూపాలని, దాడుల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం, నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని రైతులు విన్నవిస్తున్నారు. 

‘‘కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 11 వన్యప్రాణుల దాడులు నమోదయ్యాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో 6 దాడులు జరగగా, బాధితులకు రూ.1,61,843 పరిహారం చెల్లించారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో 5 దాడులు నమోదవగా, బాధితులకు రూ.60 వేల పరిహారం అందించారు. అడవులకు సమీపంలోని గ్రామాలు, పంట పొలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా కాకుండా బృందాలుగా వెళ్లాలని.. తెల్లవారుజామున, రాత్రివేళల్లో పొలాలు, అడవుల వైపు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాం.’’ అని డీఎఫ్‌వో బాలమణి చెబుతున్నారు.