నాలుగు నెలలే దర్శనం.. సప్తనదుల సంగమంలో కొలువైన సంగమేశ్వరుడు!

నాలుగు నెలలే దర్శనం.. సప్తనదుల సంగమంలో కొలువైన సంగమేశ్వరుడు!
Published on: 

ఒకవైపు నల్లమల కొండల సౌందర్యం.. మరోవైపు పవిత్ర కృష్ణమ్మ జలధారల పరవళ్లు.. ఈ ప్రకృతి ఒడిలో, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని సప్తనదుల సంగమ ప్రదేశంలో కొలువైన దివ్యక్షేత్రమే లలితా సంగమేశ్వరాలయం. ఏడు నదులు కలిసే ఈ పవిత్ర సంగమానికి పురాణ గాథలతో పాటు ప్రాచీన శిల్పకళా వైభవం ప్రత్యేక ఆకర్షణ. ఏడాదిలో ఎక్కువ కాలం కృష్ణమ్మ ఒడిలోనే సేదతీరే ఈ ఆలయం.. నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే భక్తులకు దివ్య దర్శనమిస్తుంది. సప్తనదుల సంగమం, ప్రకృతి సౌందర్యం, పురాణ విశ్వాసాలు, ఆధ్యాత్మికత కలిసిన అరుదైన క్షేత్రంగా సంగమేశ్వరం ప్రత్యేకతను సంతరించుకుంది.

8 నెలల నీటిలోనే..ఎందుకు

ఈ ఆలయం ఏడాదిలో సుమారు 8 నెలలు (జూలై-ఫిబ్రవరి) కృష్ణా జలాల్లోనే మునిగి ఉంటుంది.. మిగిలిన 4 నెలలు (మార్చి-జూన్) మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టమే ఈ ఆలయ దర్శన సమయాన్ని నిర్ణయిస్తుంది. జలాశయంలో నీరు పెరిగినప్పుడు సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. నీటి మట్టం తగ్గినప్పుడు భక్తులకు దర్శనమిస్తుంది. దీంతో ఏడాదిలో కొద్దికాలం మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే అరుదైన ఆలయంగా సంగమేశ్వరం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఏడు నదుల..అరుదైన సంగమం

సంగమేశ్వరం.. ఏడు పవిత్ర నదులు ఒకే చోట మిళితమయ్యే అద్భుత క్షేత్రం. తుంగ, కృష్ణ, వేణి, భీమ, భద్ర, భవనాసి, మలాపహరిణి..ఇలా సప్తనదులు ఏకమయ్యే అరుదైన నదీ సంగమం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఈ నదుల ప్రవాహంలో ఒక ఆసక్తికరమైన విశేషం ఉంది. ఇక్కడ ప్రవహించే నదులలో 'భవనాసి' ఒక్కటే పురుష నామం కలిగిన నది కాగా, మిగిలినవన్నీ స్త్రీ రూప నామాలు కావడం గమనార్హం. భవనాసి నది తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంటే, మిగిలిన ఆరు నదులు పడమర నుండి తూర్పు వైపునకు పారుతుంటాయి. అనంతరం ఈ జలధారలన్నీ కృష్ణా, తుంగభద్రల ప్రధాన ప్రవాహంలో కలిసి, ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం దివ్య ధామాన్ని పావనం చేస్తూ చివరికి మహా సముద్రంలో లీనమవుతాయి.

గంగాదేవికి కాకి రూపం నుండి విముక్తి!

పురాణాల ప్రకారం... మానవుల పాపాలను కడిగేస్తూ వారిని పునీతులను చేసే గంగాదేవికి, ఆ పాప భారాల కారణంగా కాకి రూపం ప్రాప్తించిందని చెబుతారు. ఆ నల్లని కాకి రూపాన్ని విముక్తి చేసుకోవడానికి గంగమ్మ సమస్త పుణ్య తీర్థాలలో స్నానాలు చేస్తూ భూమిపైన పర్యటించింది. చివరకు ఈ సప్తనదుల సంగమానికి చేరుకుని, ఇక్కడి పవిత్ర జలాల్లో మునక వేయగానే ఆ రూపాన్ని కోల్పోయి శ్వేత హంసలా మారిందట. ఇలా గంగాదేవికే పాప నివృత్తిని ప్రసాదించిన పరమ పవిత్రమైన ప్రదేశం కావడం వల్లనే ఈ క్షేత్రానికి ‘నివృత్తి సంగమేశ్వరం’ అనే పేరు స్థిరపడిందని స్థల పురాణం చెబుతోంది.

పాండవుల ప్రతిష్ఠ & చాళుక్యుల శిల్పకళ

సోమశిల సమీపంలో, కృష్ణానది నడిబొడ్డున కొలువైన ఈ సంగమేశ్వరాలయానికి విశిష్టమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉంది. ద్వాపర యుగంలో అరణ్యవాస సమయంలో పాండవులు ఈ ప్రాంతానికి చేరుకుని, సప్తనదుల సంగమ తీర్థంలో పరమశివునికి లింగప్రతిష్ఠ చేయాలని నిశ్చయించుకున్నారట. ముహూర్తం ఖరారయ్యాక, కాశీ నుంచి దివ్య శివలింగాన్ని తీసుకురావడానికి భీమసేనుడిని వారణాసికి పంపారు. అయితే ముహూర్త సమయం సమీపిస్తున్నా భీముడు తిరిగి రాకపోవడంతో, ధర్మరాజు స్థానికంగా ఉన్న ఒక వేపచెట్టును నరికి, ఆ చెక్క (దారువు)తోనే శివలింగాన్ని తయారుచేసి నిష్టతో ప్రతిష్ఠించాడు. కొద్దిసేపటికే కాశీ నుంచి లింగాలతో తిరిగివచ్చిన భీముడు, అప్పటికే ప్రతిష్ఠ పూర్తవ్వడం చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తీవ్ర ఆవేశంలో తాను తెచ్చిన లింగాలను ఆకాశంలోకి విసిరికొట్టాడు. అలా భీముడు విసిరిన లింగాలు పడిన ప్రదేశాలే నేటి మల్లేశ్వరం, అమరగిరేశ్వరం, కపిలేశ్వరం, సిద్ధేశ్వరం దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయని స్థల పురాణం చెబుతోంది. కాలక్రమేణా, క్రీస్తు శకం 9వ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజులు ఈ సంగమేశ్వర ఆలయాన్ని రాతి శిల్పకళతో అత్యంత వైభవంగా నిర్మించారు.

చెక్కుచెదరని వేపదారు లింగం!

ధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ వేపదారు (వేపచెక్క) లింగాన్ని భక్తులు అత్యంత మహిమాన్వితమైనదిగా నిష్టతో పూజిస్తారు. సాధారణంగా నీటిలో తడిస్తే ఏ కర్ర అయినా పాడైపోతుంది, కానీ శ్రీశైలం ప్రాజెక్టు ముంపు వల్ల ఏడాదిలో సింహభాగం కృష్ణమ్మ ఒడిలోనే నానుతున్నా... ఈ వేపదారు శివలింగం నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఇక్కడి అద్భుతమైన ఆధ్యాత్మిక వింత! శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరి, గర్భగుడిలోకి కృష్ణమ్మ స్పర్శ తగిలే సమయానికి అర్చకులు సంగమేశ్వరుడికి ఆ సంవత్సరానికి చివరి పూజలు చేసి వీడ్కోలు పలుకుతారు. మళ్లీ వరద నీరు తగ్గి, ఆలయం నీటి నుంచి బయటపడ్డాక ప్రత్యేక పూజలు, సంప్రోక్షణలు, హోమాలు నిర్వహించి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. తన జటాజూటంలో గంగను దాచుకున్న ఆ పరమశివుడే, స్వయంగా అదే గంగమ్మ ఒడిలో విశ్రమించడం ఈ క్షేత్రంలో మాత్రమే కనిపించే మహోన్నత విశేషం.

ఇలా వెళ్లాలి

హైదరాబాద్‌ నుంచి సోమశిలకు దాదాపు 180 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజధాని నుంచి ప్రధానంగా రెండు మార్గాల్లో సోమశిలకు చేరుకోవచ్చు. మొదటిది.. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ (కల్వకుర్తి-నంద్యాల కొత్త హైవే) మీదుగా వెళ్లే మార్గం కాగా, రెండోది షాద్‌నగర్‌, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ దారి. ఇలా సోమశిల తీరానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కృష్ణానదిలో మరబోట్లు లేదా పడవల్లో కేవలం 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. నదీ ప్రవాహంలో సుమారు 10 నుంచి 15 నిమిషాల లాంచీ ప్రయాణం తర్వాత నీటినడుమ వెలిసిన లలితా సంగమేశ్వర ఆలయాన్ని చేరుకోవచ్చు.