ఇడుపులపాయ నుంచి ఎర్రవల్లి వరకు..సీఎంల చుట్టూ భూప్రకంపనలు

ఇడుపులపాయ నుంచి ఎర్రవల్లి వరకు..సీఎంల చుట్టూ భూప్రకంపనలు
Published on: 

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన అంశాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. పాలకులు, నాయకులు, మాజీ ముఖ్యమంత్రుల చుట్టూ భూ వివాదాలు ముసురుకోవడం ఇదే తొలిసారి కాదు. అధికార పీఠాలు మారాయి.. ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు.. కానీ వారి చుట్టూ అల్లుకున్న భూ వివాదాలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలకు తెరతీస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వివాదాలు రాజకీయ ప్రకంపనలకు దారితీస్తే.. మరికొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి కొనసాగిన చర్చలకు కేంద్రబిందువుగా మారాయి.

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో భూములకు సంబంధించిన వివాదాలు కొత్తేమీ కాదు. అయితే.. ముఖ్యమంత్రుల కుటుంబాలు, వారి ఫామ్‌హౌస్‌ల చుట్టూ చోటుచేసుకున్న భూ వ్యవహారాలు మాత్రం ఎప్పుడూ ప్రత్యేక చర్చకు దారితీశాయి. అలాంటి వివాదాల్లో ఇడుపులపాయ, ఎర్రవల్లి వ్యవహారాలు ప్రధానంగా నిలిచాయి. ఒకటి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ఇడుపులపాయ భూములపై ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ అసెంబ్లీ నుంచి హైకోర్టు వరకు వెళ్లింది. ఇప్పుడు కేసీఆర్ విషయంలో మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఆరోపణలు చేస్తూ.. రెవెన్యూ అధికారులతో విచారణకు ఆదేశించింది.

ఇడుపులపాయ.. అప్పట్లో సంచలనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ఆయన కుటుంబానికి రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న ప్రాంతం.  ఇడుపులపాయలో వైఎస్ కుటుంబానికి ఎస్టేట్ ఉండేది. అయితే అందులోని కొన్ని వందల ఎకరాల భూములు పేదలకు కేటాయించిన "అసైన్డ్ భూములు" (Assigned Lands) అని, నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములను వైఎస్ఆర్ కుటుంబం తమ వశం చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ భూముల వ్యవహారం ఒక్కసారిగా రాజకీయ వివాదంగా మారింది. 2006 డిసెంబర్ లో ఈ అంశం అసెంబ్లీలో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో 2006, డిసెంబర్ 12న అసెంబ్లీ లోనే వైఎస్ఆర్ స్వయంగా స్పందిస్తూ, తమ కుటుంబం కొనుగోలు చేసిన భూముల్లో తమకు తెలియకుండానే కొన్ని అసైన్డ్ భూములు భాగమయ్యాయని వివరణ ఇచ్చారు.

ఈ చర్చ సందర్భంగా ఇడుపులపాయలో తమ కుటుంబానికి 715 ఎకరాలు ఉన్నాయని ప్రకటించారు. తర్వాత వారం 2006, డిసెంబర్ 18న జరిగిన సందర్భంగా ఇడుపులపాయలో ఉన్నది 715 ఎకరాలు కాదు 614 ఎకరాలు మాత్రమే అని ప్రకటించారు. అందులో   310.57 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు (సరండర్) తెలిపారు. ఇందులో అసైన్డ్ భూమి (50.76 ఎకరాలు), పంచాయతీరాజ్ బీడు భూమి (69.33 ఎకరాలు), దేవాదాయ భూమి (6.94 ఎకరాలు), రస్తా పోరంబోకు (7.86 ఎకరాలు), పంచాయతీ చెరువు భూమి (45.52 ఎకరాలు) మరియు పట్టా భూమి (123 ఎకరాలు) ఉన్నాయని లెక్కలు చెప్పారు.

ఇదే చర్చలో వైఎస్ఆర్ మరో సంచలన ప్రకటన చేశారు. తమ కుటుంబానికి ఇడుపులపాయలోని 614 ఎకరాలకు అదనంగా రేణిగుంట-కడప పట్టణాల మధ్య రాజంపేట పరిధిలోని కుందూరు గ్రామంలో మరో 1,000 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. ఆ భూమి రిజిస్టర్ కాలేదని, తన తండ్రి Y.S. రాజారెడ్డి చెట్లు పెంచి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేశారని చెప్పారు. కడప వద్ద తమకున్న మరో 120-140 ఎకరాల వ్యవసాయేతర భూమిని కూడా తన 'భూదాన్ యజ్ఞం'లో భాగంగా ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

భూములను స్వచ్ఛందంగా అప్పగించినందున తనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేరని వైఎస్ఆర్ పేర్కొనగా... టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిపక్షాలు ఈ మినహాయింపులు అధికారులకే వర్తిస్తాయని, సీఎం పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై ప్రతిపక్షం మరింత తీవ్రంగా స్పందించింది. వైఎస్ఆర్ ను పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌ను కోరుతూ 2006, డిసెంబర్ 20న ప్రతిపక్ష నేతలు రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేశారు.

అసెంబ్లీ దాటి.. హైకోర్టుకు చేరిన ఇడుపులపాయ

ఇడుపులపాయ భూముల వ్యవహారం అసెంబ్లీతో ఆగలేదు. అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి పి. అశోక్ గజపతిరాజు వైఎస్, ఆయన కుటుంబం భూముల సమీకరణలో చట్టాలను ఉల్లంఘించిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. AP Land Reforms (Ceiling on Agricultural Holdings) Act, Assigned Lands చట్టం తదితర నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ఈ పిటిషన్‌ను హైకోర్టు infructuousగా (పరిష్కారం అవసరం లేకుండా పోయినది / ప్రయోజనం లేనిదిగా మారినది / విచారణ కొనసాగించాల్సిన అవసరం లేనిది అని అర్థం.) కొట్టివేసింది. అంటే భూములపై ఆరోపణలు నిజమని కానీ, తప్పని కానీ కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు.

ఎర్రవల్లిపై ప్రభుత్వ గురి

2026 సెప్టెంబర్ 16న అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన అంశాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపాయి. దాదాపు 700 ఎకరాలు కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం ఆరోపించింది. ఇందులో సర్వే నంబర్‌ 325లో 388 388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

అప్పుడు ప్రతిపక్షం.. ఇప్పుడు.. ప్రభుత్వం ప్రశ్నిస్తోంది

ఇడుపులపాయలో.. ప్రతిపక్షం ప్రశ్నించింది. ఎర్రవల్లిలో.. ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. వైఎస్ఆర్ విషయంలో ప్రతిపక్షం భూములపై ఆరోపణలు చేసి కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం, వైఎస్ కుటుంబం తమ వాదనలు వినిపించాయి. వైఎస్ఆర్ కుటుంబం వారి ఆధీనంలోని అసైన్డ్ భూములను ప్రభుత్వానికి అప్పగించింది. చివరకు వైఎస్ మరణం కారణంగా హైకోర్టు కేసును infructuousగా ముగించింది. కేసీఆర్ విషయంలో మాత్రం ప్రస్తుత ప్రభుత్వం స్వయంగా ఆరోపణలు చేస్తూ నోటీసులు, భూ సర్వే, ఫ్యాక్ట్‌ఫైండింగ్ కమిటీ, విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ భూమి ఆక్రమణ నిర్ధారణ అయితే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంటే.. అప్పట్లో ఇడుపులపాయలో వివాదాస్పదంగా మారిన భూములు ప్రభుత్వానికి చేరితే.. ఇప్పుడు ఎర్రవల్లిలో ప్రభుత్వానికి చెందిన భూములు ఉంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ..ఇదే ఇడుపులపాయ–ఎర్రవల్లి కథలో ఆసక్తికరమైన మలుపు!”

ముఖ్యమంత్రుల చుట్టూ.. భూమి వివాదాలు కొత్త కాదు

తెలుగు రాజకీయాల్లో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు లేదా వారి కుటుంబాలకు సంబంధించిన భూముల వ్యవహారాలు అప్పుడప్పుడూ రాజకీయ తుపాన్లకు కారణమయ్యాయి. వ్యక్తిగత భూములు, కుటుంబ సభ్యుల ఆస్తులు, ప్రభుత్వ భూముల కేటాయింపులు, అసైన్డ్ భూములు, భూ పరిమితి చట్టాలు, రాజధాని లేదా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ.. ఇలా వివిధ కోణాల్లో వివాదాలు తెరపైకి వచ్చాయి.

ముఖ్యమంత్రుల చుట్టూ భూముల వ్యవహారాలు కేవలం ఫామ్‌హౌస్‌లకే పరిమితం కాలేదు. అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల కేటాయింపులు, రాజధాని ప్రాంత భూముల లావాదేవీలు, కుటుంబ సభ్యులు లేదా వారితో సంబంధం ఉన్న సంస్థలకు జరిగిన కేటాయింపులపై కూడా వివిధ సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హయాంలో IMG భారతకు గచ్చిబౌలి, శంషాబాద్‌ ప్రాంతాల్లో భూముల కేటాయింపు వివాదాస్పదమైంది. 2003లో గచ్చిబౌలిలో 400 ఎకరాలను ఎకరాకు రూ.50 వేల చొప్పున కేటాయించడంపై అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయగా, అనంతరం ఈ వ్యవహారంపై కోర్టు, ఏసీబీ స్థాయిలోనూ కేసులు నడిచాయి. 2024లో తెలంగాణ హైకోర్టు 850 ఎకరాల కేటాయింపును రద్దు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

అలాగే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి ని ప్రకటించే ముందు, అప్పటి ప్రభుత్వ పెద్దలు,  వారికి సన్నిహితంగా ఉన్నవారు ముందే సమాచారం తెలుసుకుని పేద రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారంటూ 'ఇన్ సైడర్ ట్రేడింగ్' ఆరోపణలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మోపడమే కాకుండా సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో  2024లో ఏపీ సీఐడీ అమరావతి ప్రాంతంలోని సుమారు 1,100 ఎకరాల అసైన్డ్‌ భూములకు సంబంధించిన కేసులో చంద్రబాబు నాయుడు, పి. నారాయణ తదితరుల పేర్లతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2026 జులై 15న ఏపీ హైకోర్టు (జస్టిస్ వై. లక్ష్మణరావు ధర్మాసనం) ఈ కేసుకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్/కేసును పూర్తిగా కొట్టివేసింది (Quashed).

తెలంగాణలో ప్రస్తుత సందర్భంలో రేవంత్‌రెడ్డి సోదరుడితో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న టెస్సెరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు రావిర్యాలలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపుపై బీఆర్‌ఎస్‌ 2026లో ఆరోపణలు చేసింది.

మొత్తానికి, తెలుగు రాష్ట్రాల రాజకీయంలో 'భూమి' అనేది కేవలం ఒక స్థిరాస్తి మాత్రమే కాదు. అధికారంలో ఉన్నప్పుడు కేటాయింపులు, అధికారం కోల్పోయాక విచారణలు... ఈ విచిత్ర చక్రభ్రమణం పాలకుల చుట్టూ నిరంతరం తిరుగుతూనే ఉంది.