ఆహార కల్తీ.. అడ్డుకట్టేదీ?

ఆదిలాబాద్ జిల్లా బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్ ప్రాంతాల్లో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల ఆహార నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Food safety Concerns In Adilabad District
Published on: 

ప్రభాత ఉదయం, బోథ్ (ఆదిలాబాద్): బోథ్ నియోజకవర్గంలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది. బోథ్‌తోపాటు ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, బేకరీలు, స్వీట్‌ హోమ్‌లు, బిర్యానీ పాయింట్లు, మాంసం దుకాణాల ఆహార భద్రతా ప్రమాణాలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ,  క్షేత్రస్థాయిలో వారి పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

నాసిరకం రంగులు..  రసాయనాలు

సాయంత్రం కాగానే రద్దీగా మారే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో ప్రజారోగ్యానికి విఘాతం కలుగుతోంది. యువత, చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే మంచూరియా, నూడుల్స్, ఫ్రైడ్‌రైస్ లాంటి పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడానికి అనుమతిలేని కృత్రిమ రంగులు, రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటి తయారీకి వినియోగించే నూనెను కూడా మళ్లీమళ్లీ వేడి చేసి వాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నూనెతో చేసిన పదార్థాలను తింటే గ్యాస్ట్రిక్, గుండె సంబంధిత సమస్యలతోపాటు దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే ముప్పు ఉంది. నాణ్యతలేని మసాలాలు, కలుషిత నీరు, పొగ, దుమ్ముతో నిండిన అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారాన్ని తయారు చేయడం సర్వసాధారణమైపోయిందని వాపోతున్నారు.

పగిలిన గుడ్లతో వంటకాలు

ఎగ్ ఫ్రైడ్‌రైస్, ఎగ్ మంచూరియా, ఆమ్లెట్లు తదితర వంటకాల్లో ఉపయోగించే గుడ్ల నాణ్యతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయి. వ్యాపారులు ఖర్చు తగ్గించుకునేందుకు మార్కెట్‌లో చవకగా లభించే పగిలిన, నాసిరకం గుడ్లను కొనుగోలు చేసి వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పగిలిన గుడ్లలో చేరే ‘సాల్మొనెల్లా’ లాంటి హానికర బ్యాక్టీరియా వల్ల ఆహారం విషపూరితం అవుతుంది.  

బేకరీలు, హోటళ్లలో లోపించిన నిఘా

నియోజకవర్గ పరిధిలోని బేకరీలు, స్వీట్ హౌస్‌లలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేకులు, క్రీమ్ బన్స్, స్వీట్‌ల తయారీలో గడువు ముగిసిన ముడిసరుకులు, కల్తీ నెయ్యి, కలుషిత పాలు వాడుతున్నారనే విమర్శలున్నాయి. ఫంగస్ పట్టిన పదార్థాలను కూడా వదలకుండా విక్రయిస్తున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసం, మిగిలిపోయిన కూరలు, బిర్యానీలను మరుసటి రోజు మళ్లీ వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. కిచెన్లలో బొద్దింకలు, ఈగలు స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అలాగే పానీపూరీ, జ్యూస్ సెంటర్లలో వాడే నీరు, ఐస్ నాణ్యత కూడా అనుమానాస్పదంగానే ఉంది.

తనిఖీలు శూన్యం

గతంలో ఆదిలాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేసి కుళ్లిన మాంసం, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి నోటీసులు ఇచ్చారు. కానీ మండల కేంద్రాలైన ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, బోథ్‌లో ఇప్పటి వరకు ఎన్ని తనిఖీలు జరిగాయి, ఎంతమంది వ్యాపారులపై చర్యలు తీసుకున్నారో తెలియదని ప్రజలు వాపోతున్నారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ, మండల కేంద్రాల్లోనూ తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

ఆహార భద్రత  ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంది. ‘‘ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, బేకరీలు, మాంసం దుకాణాలపై అధికారులు తనిఖీలు చేపట్టాలి’’ అని స్థానిక వైద్యుడు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ అన్నారు. ‘‘నాణ్యతలేని ముడిసరుకులు, కల్తీ రసాయనాలు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో చైతన్యం పెంచాలి’’ అని కోరారు.