బావుల నిండా నీరు.. సాగుకు కన్నీరు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతుంటే.. మాధవాపురం గ్రామంలో మాత్రం పచ్చటి పైర్లు కనువిందు చేస్తున్నాయి.
Madhavapuram Farmers Issues
Published on: 

ప్రభాత ఉదయం, మహబూబాబాద్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతుంటే.. మాధవాపురం గ్రామంలో మాత్రం పచ్చటి పైర్లు కనువిందు చేస్తున్నాయి. బావుల ఆధారంగా వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు విద్యుత్‌ సమస్యలు సవాల్‌గా మారాయి. సకాలంలో సాగునీరు అందక పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం

మాధవాపురం గ్రామంలో 1,109 మంది రైతులు సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 1,600 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మిర్చి, మరో 200 ఎకరాల్లో పత్తి తదితర పంటలు ఉన్నాయి. మరో 200 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. సాగునీటి కోసం బావులున్నా.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీపావళి వరకు రోజుకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తేనే పంటలు చేతికి వస్తాయని రైతులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఇదే విధంగా కొనసాగితే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధిక లోడ్‌తో తరచూ బ్రేక్‌డౌన్లు

ఎండల తీవ్రతతో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడ్‌ పడుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రతి అరగంటకోసారి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని, మోటార్లు నడపలేక పంటలకు నీరందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.

చెరువు తూము వద్ద పేరుకుపోయిన మట్టి

గ్రామంలోని దానవయ్య గుట్టల మధ్య ఉన్న చెరువు తూము వద్ద పెద్దఎత్తున మట్టి పేరుకుపోవడంతో నీటి సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ఒకవైపు విద్యుత్‌ సమస్యలు, మరోవైపు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతుండటంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.