

ప్రభాత ఉదయం, మహబూబాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన బీఎన్ గుప్తా ప్రాజెక్టు (పాత తులారం ప్రాజెక్టు) దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు వేలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా, ప్రజాప్రతినిధులు ప్రాజెక్టును సందర్శిస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని మహబూబాబాద్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయ్యారం అడవులు, చుట్టుపక్కల గుట్టలు, లోయల నుంచి వట్టే వాగు ద్వారా వచ్చే వరద నీరు గతంలో వృథాగా మున్నేరు వాగులో కలిసేది. ఈ నీటిని ఒడిసిపట్టి సాగుకు వినియోగించాలనే లక్ష్యంతో కాకతీయుల కాలంలో ప్రస్తుత వినోబా నగర్ సమీపంలో ఆనకట్ట నిర్మించినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. అయితే ఆ నిర్మాణం కొద్దికాలానికే తెగిపోయింది. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు బీఎన్ గుప్తా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం కృషి చేశారు. ఆయన ప్రయత్నాలతో పాత ఆనకట్టను మరింత ఎత్తుకు పెంచి పునర్నిర్మించారు. సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన కాలువల నిర్మాణం పూర్తికాకపోవడం రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కుడి కాలువ మాత్రమే నిర్మించి, ఎడమ కాలువను పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందాల్సిన ప్రాంతాలన్నింటికీ ప్రయోజనం కలగడం లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రాజెక్టు ఎత్తు పెంపుపై ప్రణాళికలు రూపొందించినప్పటికీ, పనులు మాత్రం ముందుకు సాగలేదని స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టు కింద సుమారు 8 వేల ఎకరాలకే సాగునీరు అందుతోందని రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడే పంటలు చేతికొస్తున్నాయని, వర్షాభావ పరిస్థితుల్లో పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తును మరో 12 అడుగులు పెంచడంతో పాటు ఎడమ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పనులు పూర్తయితే సాగునీటితో పాటు తాగునీటి సమస్యకూ కొంతవరకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.
ఇటీవల ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బీఎన్ గుప్తా ప్రాజెక్టును సందర్శించారు. పాకాల నుంచి ప్రాజెక్టు వరకు ఉన్న వాగుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాకాల నుంచి నీటిని ప్రాజెక్టుకు మళ్లించే అవకాశాలపై అధ్యయనం చేశారు.