

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల సమాచారంతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర సర్కారును టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు రాజకీయ వివక్షతో నిధులు ఇవ్వకున్నా, కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్‌ను తిట్టిన అమిత్ షా, తెలంగాణకు మోదీ సర్కారు చేసిన మేలేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తమ హక్కులు, నిధులు, అభివృద్ధి, ఉద్యోగాలు, రైతు సంక్షేమం గురించి కేంద్రం ఏమేం చేస్తోందో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. బీజేపీ నేతల ఉపన్యాసాలు వినేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ బీజేపీ నేతలు తల తోక లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
బీజేపీకి 8 సీట్లు కూడా రావు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బలహీనపడటంతో, దాని స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ యత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఈ దిశగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది సీట్లు కూడా రావన్నారు. అమిత్షా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో హైదరాబాద్లో యాత్రను చేపట్టడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే తెలంగాణ గుర్తుకు రావడం, ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్ర సమస్యలను పట్టించుకోకపోవడం బీజేపీకి అలవాటుగా మారిందని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.