

ప్రభాత ఉదయం, ఎల్బీనగర్ : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్లుగా పనిచేస్తున్న టాక్స్ ఇన్స్పెక్టర్లను తొలగించవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) విభాగం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి టాక్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగుల సంఘం నాయకులు నందకిశోర్, మల్లికార్జున్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలవుతున్నట్లుగానే రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో టాక్స్ ఇన్స్పెక్టర్లకు ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని కోరారు. మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న టాక్స్ ఇన్స్పెక్టర్లను తొలగించే ప్రతిపాదన అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
క్యూర్ పరిధిలో ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేస్తే సంబంధిత విభాగాల్లోనూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. ఏళ్లుగా సేవలందిస్తున్న టాక్స్ ఇన్స్పెక్టర్లను తొలగించే అంశాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టాక్స్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.