

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ నుంచి ‘మూగబోయిన ప్రజాస్వామ్యం’లా మారుస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో యువత ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై స్పందిస్తూ.. ‘నిర్భంధాలు, అరెస్టులు, జైళ్లు, లాఠీచార్జీలు, పెల్లెట్ గన్లు భారత ప్రజలను అడ్డుకోలేవు’ అని ఖర్గే మండిపడ్డారు. బీజేపీ- ఆర్ఎస్ఎస్ పిరికితనం ఈ చర్యల ద్వారా స్పష్టమవుతోందని విమర్శించారు. ‘దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం మా రక్తాన్ని ధారపోశాం’ మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని, ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కులను కాపాడేందుకు మా శక్తినంతా ఒడ్డి నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఖర్గే పేర్కొన్నారు.