

ప్రభాత ఉదయం, మంచిర్యాల జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి వర్గం, హాజీపూర్ మండల మాజీ అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వర్గ పోరు బహిరంగ విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. బొలిశెట్టి తిరుపతి సోమవారం మీడియా సమావేశం నిర్వహించి రఘునాథ్‌రావు, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్పై తీవ్ర ఆరోపణలు చేయగా.. బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం రఘునాథ్ వర్గం నేతలు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. దీంతో జిల్లా బీజేపీలో నెలకొన్న అసంతృప్తి బహిరంగ రాజకీయ పోరుగా మారింది.
సీనియర్లకు చోటేది?
జిల్లాలో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులకు బీజేపీలో సరైన గుర్తింపు లేకుండా పోయిందని బొలిశెట్టి తిరుపతి విమర్శించారు. రఘునాథ్రావుకు అనుకూలంగా ఉన్నవారికే పార్టీ పదవులు దక్కుతున్నాయని, అసలైన కార్యకర్తలను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి వ్యాఖ్యలపై హాజీపూర్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్, నస్పూర్ జోన్ అధ్యక్షుడు కర్రె చక్రవర్తి తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. కొందరు భూ సెటిల్మెంట్ చేసేవారితో కలిసిపోయిన తిరుపతి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌హెచ్–63 విషయంలో రఘునాథ్‌రావు వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
అప్పుడు పదవులిచ్చింది ఎవరు?
పార్టీలో పదవులు ‘పాలేర్లకు’ ఇస్తున్నారన్న తిరుపతి వ్యాఖ్యలపై రఘునాథ్ వర్గం తీవ్రంగా స్పందించింది. గతంలో హాజీపూర్ మండల అధ్యక్షుడిగా తిరుపతిని, మండల ప్రధాన కార్యదర్శిగా మడిపల్లి సత్యంను నియమించింది రఘునాథ్రావేనని గుర్తుచేశారు. తిరుపతి కుమారుడికి గతంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు ఇప్పించడంలోనూ రఘునాథ్ పాత్ర ఉందని పేర్కొన్నారు.
పార్టీ కోసమే పని చేస్తా
ఈ పరిణామాలపై బొలిశెట్టి తిరుపతిని ‘ప్రభాత ఉదయం’ జిల్లా ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా, రఘునాథ్‌రావు వర్గంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మంచిర్యాల జిల్లాలో నిజమైన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. తనకు అనుకూలంగా ఉన్నవారికే పదవులు కట్టబెడుతూ రఘునాథ్‌రావు దొర అహంకారం ప్రదర్శిస్తున్నారు. నేను ప్రధాని మోదీ కోసం పని చేస్తాను’ అని చెప్పారు. మొత్తంగా మంచిర్యాల బీజేపీలో మొదలైన అంతర్గత పోరు చివరికి వ్యక్తిగత విమర్శలు, పదవుల పంపకం, ఎన్‌హెచ్–63 అంశాల చుట్టూ తిరుగుతోంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ విభేదాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో దీని ప్రభావం బీజేపీపై ఉంటుందేమోనని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.