పంట చేతికొచ్చేదెప్పుడో?

వర్షాభావంతో మంచిర్యాల జిల్లాలో పంటల దిగుబడి ఆలస్యమవుతోంది. నవంబర్‌ రెండో వారం నుంచి పత్తి, వరి కొనుగోలు కేంద్రాలను దశలవారీగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
cotton paddy procurement delays in Mancherial
Published on: 

ప్రభాత ఉదయం, చెన్నూర్: వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా చూసిన రైతులకు ఈసారి వానలు నిరాశే మిగిల్చాయి. సకాలంలో  కురువకపోవడంతో సాగు ఆలస్యమైంది. బోర్లు, బావుల నీటిపై ఆధారపడి ఎంతోకొంత పంట వేసిన రైతులు.. ఇప్పుడు వాటి కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు పత్తి, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నది. మంచిర్యాల జిల్లాలో నవంబర్ రెండో వారం నుంచి దశల వారీగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయి కొనుగోళ్లు నవంబర్ మూడో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.    

 దిగుబడి మరింత ఆలస్యం.. 

వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది పంటల సాగు ఆలస్యమైందని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ తెలిపారు. నవంబర్ రెండో వారం నాటికి పత్తి, వరి పంటల్లో సుమారు 10 శాతం మాత్రమే చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.  రైతులకు ఇబ్బందులు కలుగకుండా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నవంబర్ రెండో వారం నుంచి దశలవారీగా కొనుగోలు కేంద్రాల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

చెన్నూరులో సీసీఐ ఆన్‌లైన్ బుకింగ్‌..

చెన్నూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రంలో పత్తి విక్రయాలకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు  సీసీఐ అధికారి భాస్కర్ తెలిపారు. పత్తి క్వింటాల్‌కు రూ.8,667 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. పంట ఇంకా పూర్తిస్థాయిలో రైతుల చేతికి రాకపోవడంతో భౌతిక కొనుగోళ్లు ప్రారంభం కాలేదని, ప్రస్తుతం ఆన్‌లైన్ సేవలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇబ్బందులు లేకుండా చూడాలి

‘సకాలంలో వర్షాలు కురువకపోవడంతో బోరుబావుల నీటిపై ఆధారపడి పంటలు ఆలస్యంగా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పంటలు కోతకు రాలేదు. డిసెంబర్ మొదటి వారం నాటికి చేతికి వచ్చే అవకాశం ఉన్నది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా పంట సిద్ధమయ్యే వరకు వేచి చూడాల్సిందే. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని చెన్నూరుకు చెందిన యువరైతు సురేశ్ కోరారు.  

సురేశ్, యువరైతు, చెన్నూరు
సురేశ్, యువరైతు, చెన్నూరు