మంచిర్యాలపై ఖాకీ కన్ను.. అర్ధరాత్రి బైక్‌పై సీపీ పెట్రోలింగ్‌!

అసాంఘిక శక్తుల కదలికలపై మంచిర్యాల పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందుకోసం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా స్వయంగా అర్ధరాత్రి బైక్‌పై పెట్రోలింగ్‌ చేస్తూ పోలీసుల పనితీరును పరిశీలిస్తున్నారు.
Mancherial police conducting night patrols
మంచిర్యాలలో రౌడీషీటర్లపై నిఘా పెంచి పెట్రోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న పోలీసులు.AI Generated Image
Published on: 

ప్రభాత ఉదయం, మంచిర్యాల : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై మంచిర్యాల పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును మత్తు ఊబిలోకి నెడుతున్న గంజాయి ముఠాలు, మాదకద్రవ్యాల సరఫరాదారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెంచారు.  పాత నేరగాళ్ల కదలికలను నియంత్రించడం, మత్తు పదార్థాల సరఫరా వ్యవస్థను ఛేదించడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా వీధుల్లో పెట్రోలింగ్ చేస్తూ సిబ్బంది పనితీరును పరిశీలిస్తుండటం ద్వారా మెరుగైన పనితీరుపై ఫోకస్ పెట్టారు. సీపీ స్వయంగా క్షేత్రస్థాయిలో పగలు, రాత్రి పర్యటిస్తుండటంతో పోలీసు సిబ్బందిలోనూ అప్రమత్తత పెరిగింది.

44 మంది రౌడీషీటర్లకు బైండోవర్

నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించిన మంచిర్యాల పోలీసులు ఈ నెల 26న ఆర్డీవో శ్రీనివాస్ సమక్షంలో 44 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు.  వీరిలో మంచిర్యాలలో 16 మంది, నస్పూర్‌లో 15 మంది, రామకృష్ణాపూర్‌లో ముగ్గురు, శ్రీరాంపూర్‌లో నలుగురు, మందమర్రిలో ఒకరు ఉన్నారు. తిలక్‌నగర్‌లో డీసీపీ ఏ. భాస్కర్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైన సందర్భాల్లో చట్టప్రకారం రౌడీషీట్లు తెరవడం, నగర బహిష్కరణ వంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి వినియోగం, సరఫరాపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన, నివారణ చర్యలపై దృష్టి పెట్టారు. పోలీస్ కమిషనర్ స్వయంగా అర్ధరాత్రి వేళ బైక్‌పై పర్యటిస్తూ పెట్రోలింగ్ పరిస్థితులను పరిశీలించడం అభినందనీయమని స్థానిక వ్యాపారి మహేష్ పేర్కొన్నారు.