‘సింగరేణి’లో చీకటి దారులు!

మందమర్రి రామకృష్ణాపూర్‌లో వీధి దీపాలు వెలగకపోవడం, ముళ్లపొదలు పెరగడంతో ఆర్కే-5 గనికి వెళ్లే సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Ramakrishnapur Singareni workers road safety concerns
Ramakrishnapur Singareni workers facing difficulties due to non-functional streetlights on roads at night
Published on: 

ప్రభాత ఉదయం, మంచిర్యాల/చెన్నూరు: కార్మికుల శ్రమతో బొగ్గు వెలుగులు విరజిమ్ముతోంది.., విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది.. లక్షలాది ఇళ్లలో దీపాలు వెలుగుతాయి. కానీ వారి జీవన గమనంలో మాత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి. విధులు ముగించుకుని ఇంటికి  క్షేమంగా చేరుతామో లేదోనన్న ఆందోళన.. తెల్లవారుజామున డ్యూటీకి బయలుదేరితే అడుగడుగునా ఆటంకమే.. ఇదీ మందమర్రి రామకృష్ణాపూర్‌ ప్రాంతంలోని పలువురు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఏరియా ఆసుపత్రి నుంచి ఆర్కే-5 సీహెచ్‌పీ గని వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వీధి దీపాలు వెలగకపోవడం, రహదారికి ఇరువైపులా ముళ్లపొదలు విస్తరించడంతో కార్మికుల రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయి.

చీకటి రహదారుల్లో ప్రాణసంకటం..

రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రి నుంచి ఆర్కే-5 ప్రధాన రహదారిపై వెళ్లే కార్మికులకు సరైన వెలుతురు ఉండటం లేదు. అంతేకాకుండా ముళ్లపొదల మధ్య, స్పీడ్‌ బ్రేకర్ల మీదుగా ప్రయాణం సాగించాల్సి వస్తున్నదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాగార్జున కాలనీ వైపు ఉన్న మూలమలుపు వద్ద చీకటి కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడం లేదని కార్మికుడు స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నాలుగు గంటలకే విధులకు బయలుదేరి, రాత్రి పది తర్వాత డ్యూటీ ముగించుకుని ఇళ్లకు చేరుకునేవారు ఈ మార్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడం, వీధి దీపాలను పునరుద్ధరించడం వంటి కనీస చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అడవి పందుల సంచారం..  

ఈ ప్రాంతంలో రాత్రివేళ అడవి పందుల గుంపులు రహదారిని దాటుతున్న క్రమంలో వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మూలమలుపుల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించుకోవడం కష్టమవుతోందని కార్మికులు పేర్కొంటున్నారు.

కార్మికుల భద్రతపై దృష్టి సారించాలి..

సింగరేణి ప్రాంతంలో వీధి దీపాలు పునరుద్ధరించడంతోపాటు, నాగార్జున కాలనీ మూలమలుపు సమస్య పరిష్కారంతో పాటు స్పీడ్‌ బ్రేకర్ల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని గణేశ్ కోరారు. రహదారికి ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలను తొలగించి, ప్రమాద సూచిక బోర్డులు, అవసరమైన రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ‘‘రంజిత్ అనే కార్మికుడు మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే డ్యూటీకి వెళ్తాను. ఏరియా ఆసుపత్రి నుంచి ఆర్కే-5 వైపు వాహనాల లైట్ల వెలుతురుతో రహదారి సరిగా కనిపించడం లేదు. రోడ్డు పక్కకు వెళితే ముళ్లకొమ్మలు తగిలి గాయాలవుతున్నాయి’’.