మేడ్చల్‌ జిల్లాకు పరిశ్రమల కళ.. కొత్తగా 783 కంపెనీలు.. 46 వేల మందికి కొలువులు!

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 783 భారీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తద్వారా 46,356 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
Medchal Malkajgiri Industrial Development Plans
Medchal Malkajgiri Industrial Development Plans
Published on: 

ప్రభాత ఉదయం, మేడ్చల్ మల్కాజిగిరి: హైదరాబాద్‌ శివార్లలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు వేలాది కుటుంబాలకు పరోక్షంగా జీవనోపాధి లభించేలా చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌–వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌తోపాటు నగరం నలువైపులా ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించింది. ముఖ్యంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

783 పరిశ్రమలు.. రూ.12,523 కోట్ల పెట్టుబడులు

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో మరో 783 భారీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ పరిశ్రమలు కార్యరూపం దాలిస్తే సుమారు 46,356 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రూ.1,998.82 కోట్ల పెట్టుబడులతో 387 పరిశ్రమలు ఏర్పాటుకాగా, 7,224 మందికి ఉద్యోగాలు లభించాయని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు.

మాదారంలో ఇండస్ట్రియల్‌ పార్కు

ఘట్‌కేసర్‌ మండలం మాదారంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పోచారంలో సుమారు 450 ఎకరాల్లో విస్తరించిన ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ను మరో రూ.750 కోట్ల పెట్టుబడితో విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన సందర్భంగా ఈ విస్తరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం పోచారం ఇన్ఫోసిస్‌లో సుమారు 25 వేల నుంచి 27 వేల మంది యువత పనిచేస్తున్నారు.

ప్రాంతాల వారీగా ప్రత్యేక పరిశ్రమలు

హైదరాబాద్‌ శివార్లలో వివిధ రంగాలకు అనుగుణంగా పరిశ్రమలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మేడ్చల్‌లో హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్‌మెంట్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్‌ అండ్‌ సైన్స్‌ ఇండస్ట్రీ, ఘట్‌కేసర్‌లో ఐటీ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రంగాలు, గుండ్లపోచారంలో ఫార్మా అండ్‌ బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయి. ఉప్పల్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల పరిధిలోని పోచారం, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌, శామీర్‌పేట, మేడ్చల్‌, కీసర, బోడుప్పల్‌, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో భూసేకరణకు టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కొండలు, గుట్టలు, అటవీ భూములకు దూరంగా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని చోట ప్రైవేటు భూములను పరిశీలించాలని పేర్కొంది. ఈ మేరకు మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ అధికారులు భూముల సమగ్ర సర్వే చేపడుతున్నారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించారు.

పదేళ్లలో 6,406 పరిశ్రమలు

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 2015 జనవరి నుంచి 2026 వరకు రూ.26,033.03 కోట్ల పెట్టుబడులతో 6,406 కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా మొత్తం 1,78,462 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీటిలో 4,383 సూక్ష్మ, 1,581 చిన్న, 215 మధ్యతరహా, 60 మెగా, 167 భారీ పరిశ్రమలు ఉన్నాయి. కొత్త పరిశ్రమల ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే జిల్లాలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.