

ఆమ్యామ్యాల కోసం కొత్త దారులు
అయినా వల వేసి పట్టుకున్న ఏసీబీ
ప్రభాత ఉదయం, హైదరాబాద్: ఆమ్యామ్యా అధికారుల తెలివి రోజురోజుకూ మితిమీరిపోతున్నది. ఒకప్పుడు టేబుల్ కింద చెయ్యి పెట్టి లంచాలు పుచ్చుకునేవారు. ఏసీబీ అధికారుల వరుస దాడులతో కొందరు అధికారులు ఇప్పుడు రూటు మార్చారు. తాజాగా మెహిదీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారిణి సునీత వ్యవహారం బయటపడటంతో లంచాలు తీసుకోవడంలో కూడా ఇంత తెలివి, ఇన్ని ట్రిక్కులు ప్రదర్శిస్తున్నారా? అని ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకున్నారు.
కార్యాలయం పరిసరాల్లో లేదా ఇంటి పరిసరాల్లో లంచం తీసుకుంటే దొరికిపోతానని ఏకంగా నడిరోడ్డునే తన లంచాల బేరాలకు, వసూళ్లకు అడ్డాగా మార్చుకున్నది. ఎంత లంచం కావాలో ముందే చెప్పేసి, సైలెంట్‌గా ఓ స్కూటీ వేసుకొని రోడ్డు పక్కన ఆపుతుంది. ఏదో పని ఉన్నట్టుగా స్కూటీ డిక్కీ తెరిచి పక్కకు వెళ్లి నిలబడుతుంది. లంచం ఇచ్చే బాధితులు ఆ డిక్కీలో డబ్బులు వేయగానే ఏం తెలియనట్టుగా స్కూటీ స్టార్ట్ చేసుకొని దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ తతంగం ఎన్నేండ్ల నుంచి నడుస్తుందో కానీ ఈసారి మాత్రం ఆ స్కెచ్ బెడిసికొట్టింది.
ఎలా బయటపడిందంటే?
మెహిదీపట్నంలోని పద్మనాభనగర్‌లో ఓ ఇంటి యజమాని జీ ప్లస్-3 భవన నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. దరఖాస్తును గమనించిన టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ సునీత ఆ ఇంటి యజమానిని టార్గెట్ చేసింది. సదరు యజమాని నిర్మిస్తున్న భవనం అక్రమమని బెదిరింపులకు దిగింది. ఇంటి నిర్మాణం సాఫీగా జరగాలంటే రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రోజుల తరబడి సాగిన బేరసారాల తర్వాత చివరకు రూ.8 లక్షలకు డీల్ కుదిరింది. తన కష్టంతో కట్టుకుంటున్న ఇంటికి అనుమతి కోసం ఓ లంచగొండి అధికారిణికి లంచం ఇవ్వడానికి ఆ బాధితుడికి మనసొప్పలేదు. వెంటనే అతను ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో సునీతను పట్టుకునేందుకు ఎర వేశారు. ఒప్పందంలో భాగంగా తొలి విడతగా రూ.4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న బాధితుడు లక్డీకాపూల్ టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నాడు. ఏసీబీ అధికారులు కూడా అక్కడే మాటు వేశారు. డబ్బులు చేతికి ఇవ్వకుండా తన స్కూటీ డిక్కీలో వేయాలని బాధితుడికి సూచించింది అధికారిణి సునీత. అందుకోసం ముందుగానే స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి కొంచెం దూరంగా వెళ్లి నిల్చుంది. బాధితుడు అందులో డబ్బులు వేయగానే అక్కడి నుంచి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తొలుత తాను ఆ డబ్బులు ముట్టుకోలేదని, ఆ సొమ్ముకు తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. తన స్కూటీలోకి ఆ డబ్బులు ఎలా వచ్చాయో తెలియదని ఏసీబీ అధికారులను నమ్మిచేందుకు ప్రయత్నించింది. చివరికి ఏసీబీ అధికారులు ఆధారాలు బయటపెట్టడంతో నిజం చెప్పేసింది. గతంలో సైతం ఇలాగే కొంతమంది నుంచి లంచం డిమాండ్ చేసి స్కూటీ డిక్కీలో వేసుకునేదని పలువురు బాధితులు వాపోయారు. ఏసీబీ అధికారులు సునీత ఇంటితోపాటు ఆమె బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు.