ప్రభాత ఉదయం, నల్లగొండ : ఎస్ఎల్బీసీ పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రైతులకు సాగునీరు అందుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బి. హేమలత వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా వి.శ్రీనివాస్ గౌడ్‌తోపాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ కార్పొరేషన్‌ను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జిల్లాలో రూ.2 వేల కోట్లతో డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లతో సుమారు 9 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, మండల కేంద్రాల నుంచి జిల్లా, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. నల్గొండ నుంచి ధర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో ఆరు వరుసల రహదారి, ధర్వేశిపురం–కనగల్ వరకు రహదారి పనులు చేపట్టినట్లు తెలిపారు.
వేగంగా పనులు
రూ.2 వేల కోట్లతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును తమ హయాంలోనే చేపట్టామని, ఇప్పటివరకు 35 వేల ఎకరాలకు నీరు అందించామని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ పనులను రూ.450 కోట్లతో చేపట్టామని, ముశంపల్లి సబ్‌స్టేషన్‌తోపాటు రహదారిని మంజూరు చేయించామని వెల్లడించారు. ఇళ్లు లేని పేదలకు హౌసింగ్ బోర్డు పక్కన స్థలం కేటాయించామని, జీ ప్లస్ త్రీ నమూనాలో 500 గృహాలు నిర్మించి అందజేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, కలెక్టర్ బి. చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.