

ప్రభాత ఉదయం, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత, ఉపాధి సమస్యలు, పశువులకు పశుగ్రాసం కొరత వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఆదివాసి గిరిజన కుటుంబానికి కనీసం 125 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని స్పష్టం చేశారు.
హైదరబాద్‌లో గురువారం వీబీజీ రామ్‌జీ ద్వారా ఎల్‌నినో కరువు నివారణ చర్యలపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్తోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అదనపు డీఆర్డీఓలు, పీవోలు, ఎంపీడీవోలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రజల అభివృద్ధే గ్రామ అభివృద్ధి అని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి జీవనోపాధి, కనీస మౌలిక సదుపాయాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. “చిట్టచివరి గ్రామంలోని చిట్టచివరి వ్యక్తి అభివృద్ధి చెందడమే నిజమైన సమగ్ర అభివృద్ధి” అని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఆదివాసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాల స్ఫూర్తితో, ప్రస్తుతం కూడా ఐటీడీఏలు, పంచాయతీరాజ్ శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
వర్షపాతం లోటు.. ముందస్తు చర్యలు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాల పరిధిలోని 320 మండలాలల్లో తీవ్ర ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించచారని, ఈ సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వర్షపాతం లోటు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అధికారులు గ్రామాల్లో పర్యటించాలి: మంత్రి
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని, ప్రతి కుటుంబానికి జాబ్‌కార్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. రాబోయే ఐదు నెలల్లో ప్రతి జాబ్‌కార్డుకు నెలకు కనీసం రూ.7,500 వేతనం లభించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కింద అందుబాటులో ఉన్న 370 రకాల పనులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలన్నారు. అటవీ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, నీటి సంరక్షణ పనులు చేపట్టడంతోపాటు ఉపాధి హామీ పనులను స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికతో అమలు చేస్తే కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా నిరంతరం గ్రామాల్లో పర్యటించాలని మంత్రి సూచించారు.
పంచాయతీరాజ్ శాఖ, ఐటీడీఏలు, పేదరిక నిర్మూలన సంస్థలు సమన్వయంతో పనిచేసి ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సర్పంచులు, క్షేత్రస్థాయి సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించుకుంటూ మారుమూల గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అన్నారు.