మార్కెట్ యార్డులను డిజిటలైజ్ చేయాలి : మంత్రి తుమ్మల

రైతులకు పారదర్శక సేవలు అందించేందుకు మార్కెట్ యార్డులను ఏఐ ఆధారంగా డిజిటలైజ్ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. కోహెడ మార్కెట్ పనులను మార్చికి పూర్తి చేయాలన్నారు.
Minister Tummala Nageswara Rao
ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెట్ యార్డుల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ ​: రాష్ట్రంలో ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెట్ యార్డ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడంతో పాటు, మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు పూర్తి పారదర్శకంగా జరిగేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. మార్కెట్ యార్డులోకి రైతు ప్రవేశించినప్పటి నుంచి పంట అమ్ముకొని బయటకు వెళ్లే వరకు అన్ని అంశాలను డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రైతు వివరాల నమోదు, ప్రతి పంట లాట్‌కు ప్రత్యేక ఐడీ కేటాయింపు, డిజిటల్ బిడ్డింగ్ లేదా టెండర్ నమోదు, పంట నాణ్యత పరీక్ష, ఆన్‌లైన్ వేలం, ధర, ఈ-రసీదులు, ఈ-పర్మిట్ల జారీ వరకు అన్ని ప్రక్రియలు నిర్వహించేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ఐటీ శాఖతో సమన్వయం చేసుకొని వారం రోజుల్లోగా టెండర్లు పిలిచే ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. యార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గోదాముల నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులపై ఉన్నతాధికారులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సంస్థ ప్రతినిధులతో తుమ్మల రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చే మార్చి నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేసి, మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.