

ప్రభాత ఉదయం, మానకొండూర్: పోలీస్ కొలువు అంటేనే సవాళ్లతో సహవాసం. పోలీసు ఉద్యోగాలలో మహిళలు రాణించలేరన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఆ శాఖ ఉద్యోగ సాధనలో యువతులు దూసుకుపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన మోడుంపల్లి మహేశ్వరి డీఎస్పీగా ఎంపికై మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పేదరికంతో కూడిన గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి, పట్టుదలతో గ్రూప్-1 సాధించి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టబోతున్న మహేశ్వరి విజయం మానకొండూరు ప్రాంత ప్రజలకు గర్వకారణంగా, యువతకు ప్రేరణగా నిలిచింది.
పేదకుటుంబానికి చెందిన మహేశ్వరి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, కూతురు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కలను నేరవేర్చేందుకు తీవ్రంగా శ్రమించింది. మహేశ్వరి తండ్రి మోదుంపల్లి లక్ష్మణ్, నాలుగు సంవత్సరాలక్రితం చనిపోయాడు. తల్లి శంకరమ్మ కూలి పని చేస్తూ కూతురిని ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా, చదువు ఆగిపోకుండా మహేశ్వరి పట్టుదలతో ముందుకు సాగింది. మానకొండూర్లో పదవ తరగతి, లయోల జూనియర్ కాలేజ్లో ఇంటర్, కరీంనగర్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసింది. గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కాలేజ్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివిన మహేశ్వరి, గత ఏడు సంవత్సరాలుగా పలు పోటీ పరీక్షలకు హాజరైంది.
2025 గ్రూప్-1 పరీక్షలో ప్రతిభ చాటి తొలి ప్రయత్నంలోనే 474 ర్యాంకు సాధించి నేరుగా డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. గత ఏడాది నుంచి డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేరుగా రిక్రూట్ అయి, శిక్షణ పూర్తి చేసుకున్న మొట్టమొదటి డీఎస్పీల బ్యాచ్ ఇదే కావడం విశేషం. తెలంగాణ పోలీస్ అకాడమీలో సోమవారం మల్టీ జోన్-1కి ఎంపికైన ఆమె పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నారు. పట్టుదల ఉంటే మహిళలు సాధించలేనిదంటూ ఏదీ లేదనడానికి మహేశ్వరి నిదర్శనం అని అభినందనలు అందుకుంటున్నారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టబోతున్న మహేశ్వరి మాట్లాడుతూ – “గ్రామీణ నేపథ్యంలోని సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చినా, కష్టపడి చదివితే పెద్ద పెద్ద విజయాలు సాధించవచ్చు అని, చదువుతో జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చని” అన్నారు. నా విజయం బాలికలకు ప్రేరణ కావాలని పేర్కొన్నారు.